KCR and Harish Rao get relief in TG High Court | హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లకు హైకోర్టులో ఊరట లభించింది. ఇదివరకే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గా లేవని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టగా.. తాజాగా హైకోర్టు ఆ నోటీసులను సస్పెండ్ చేసింది. విచారణ వచ్చే నెల 7 వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో నోటీసులు జారీ చేసిన భూపాలపల్లి కోర్టు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం (Medigadda Barrage)లో అవినీతి ఆరోపణల అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని హైకోర్టును బీఆర్ఎస్ అగ్రనేతలు కోరారు. రాజలింగమూర్తి అనే వ్యక్తి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రమాణాలు పాటించని కారణంగా వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన భూపలపల్లి జిల్లా కోర్టు జులై 10న కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. వీటిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు కేసీఆర్, హరీష్‌కు ఊరట కల్పించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల ముందు నుంచే కాళేశ్వరం సమస్య
ఎన్నికల సమయం నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కరెక్టుగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం హస్తం నేతలకు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో మేడిగడ్డ ఫొటోలు వైరల్ కావడం, బ్యారేజీకి పగుళ్లు, పిల్లర్లు కుంగడాన్ని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవడం తెలిసిందే. కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్ల అవినీతికి కాళేశ్వరం నిదర్శనమని, కుటంబానికి ఏటీఎంలా ప్రాజెక్టు పనిచేసిందని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో సైతం ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీచేలా చేసింది. కానీ ఆ తరువాత చూసుకుంటే వర్షాలకు బ్యారేజీకి ఏ సమస్యా రాలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఉన్నతస్థాయి నిపుణుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం పరిశీలించింది. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను, సంబంధిత అధికారులను విచారించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాళేశ్వరాన్ని ఎన్నో సందర్భాల్లో పావుగా వాడుకుందని తెలిసిందే.