Snake Bite in Nagarkurnool District | నాగర్‌కర్నూలు: ఓ చిన్నారికి పాము కరిచింది. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, స్థానికులు రెండు పాములను చంపేశారు. మొదట ఓ పామును కొట్టి చంపేశారు. అదే సమయంలో మరో పాము అక్కడికి రావడంతో ఇదే కరిచి ఉండొచ్చునన్న కోపంతో దాన్ని కూడా చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందదంటే..
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కంసాన్ పల్లిలో తొమ్మిదేళ్ల బాలిక ఆడుకుంటుండగా ఓ పాము కరిచింది. పాము కరవడంతో అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా ఓ పాము కనిపించడంతో స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. అనూహ్యంగా అక్కడికి మరో పాము రావడంతో ఏ పాము కరిచిందో తెలియక దాన్ని కూడా చంపేశారు. అనంతరం రెండు పాములను బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
స్నేక్ క్యాచర్‌ను పిలిచిన డాక్టర్లు
బాలికను పాము కరిచిన చోట రెండు పాములు కనిపించడంతో స్థానికుల సాయంతో వాటిని చంపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఏ పాము కరిచిందో తెలయదు కనుక వాటిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టర్లకు చూపించామన్నారు. అవి పరిశీలిస్తే చికిత్స అందించడం తేలిక అవుతుందని భావించినట్లు బాలిక కుటుంబం తెలిపింది. డాక్టర్లు స్నేక్ క్యాచర్ సుమన్‌కు దీనిపై సమాచార ఇచ్చారు. అనంతరం హాస్పిటల్‌కు వచ్చిన స్నేక్ క్యాచర్ రెండు పాములను పరిశీలించాడు. ఆ పాములతో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిచెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.
Also Read: Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
చిన్నారులు ఆడుకునే సమయంలో పాము కాటుకు గురవడం తరచుగా వింటూనే ఉంటాం. అయితే తమ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమైనా ప్రమాదకర ప్రాణాలు ఉన్నాయా అని జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. పెద్దలకు సైతం కొన్నిసార్లు పాములు కరుస్తుంటాయి. అయితే విషం శరీరానికి పాకకుండా ఆ భాగానికి తాడు లాంటికి కట్టి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు దక్కడానికి అవకాశాలు అంత మెరుగవుతాయి. ఇంట్లో పెద్దవాళ్లు ఏం అంటారో అని భయపడి చెప్పకపోవడం వల్ల సైతం చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచించారు.