Allu Arjun Attends Enquiry at hikkadapalli Police Station | హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్, లీగల్ టీం సైతం వెళ్లింది. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారని లాయర్ అశోక్ తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు చెబుతారని, ఇందులో ఏ ఇబ్బంది లేదన్నారు. లాయర్ సమక్షంలో విచారణ జరగనుంది. చిక్కడపల్లి ఏసీపీ, సీఐ రాజు అల్లు అర్జున్‌ను విచారించనున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.
చిక్కడపల్లి పీఎస్ వద్ద భద్రత కట్టుదిట్టం
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి, పీఎస్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అల్లు అర్జున్, పోలీసుల పరస్పర ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పోలీసులు చేసిన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. తనను వ్యక్తిగతంగా దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తాను రోడ్ షో చేయలేదని, ర్యాలీ కూడా చేయలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం వల్లే తాను సినిమాకు వెళ్లానని, లేని పక్షంలో వాళ్లు తనను వెనక్కి పంపే వారని చెప్పారు. మరో ఆరోపణ ఏంటంటే.. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారు, ఆమె కొడుకు కొన ఊపిరితో ఉన్నాడని చిక్కడపల్లి ఏసీపీ చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదు. పరిస్థితి మరింత ముదరడంతో డీసీపీ వెళ్లి హెచ్చరించిన తరువాతే అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సినిమా చూశాకే వెళ్లిపోతానని చెప్పిన అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతోనే బయటక వెళ్లిపోయారని సీపీ తెలిపారు. థియేటర్ నుంచి వెళ్లిపోతూ సైతం కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట..
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ డిసెంబర్ 4న తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70 ఎంఎంకు వెళ్లారు. థియేటర్ కు ర్యాలీగా రావడం, ఒక్కసారిగా థియేటర్ గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. మహిళా అభిమాని రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహతప్ప పడిపోయారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. రేవతి అదివరకే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
తొక్కిసలాట ఘటన వైరల్ కావడం, బాధితులకు న్యాయం జరగలేదని ప్రభుత్వం భావించి చర్యలు చేపట్టింది. మరోవైపు రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్ పై మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. నటుడ్ని ఏ11గా చేర్చిన పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.