Allu Arjun: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తమదైన శైలిలో కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు గంటల పాటు వివిద అంశాలపై ప్రశ్నించారు. పుష్ప ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ ను సమాధానాలు రాబట్టారు. చిక్కడల్లి సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఏసీపీ, డీసీపీలు కూడా విచారణ బృందంలో ఉన్నారు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి మాటలను రికార్డు చేశారు. అల్లు అర్జున్ కు ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు.. వాటికి అనుబంధంగా ఇతర విషయాలను కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలియదా ?
పోలీసులు సంధ్యా ధియేటర్ కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు...సంధ్యా థియేటర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని చిత్రబృందానికి అందించినప్పుడు...పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా ఎందుకు థియేటర్ కు వచ్చారు అనే సూటి ప్రశ్నను పోలీసులు సంధించారు. పైగా రోడ్ షో ఎందుకు చేశారనే ప్రశ్న ఎదురైంది. దీనికి అల్లు అర్జున్ తనకు అనుమతి లేదన్న విషయం తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులే రూట్ క్లియర్ చేయడంతో అనుమతి ఉందనుకున్నానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
రేవతి చనిపోయిందని తర్వాత రోజు తెలిసింది !
రేవతి చనిపోయిందన్న విషయం పై రెండో ప్రశ్నను పోలీసులు అడిగినట్లుగా తెలుస్ోందది. మీకు రేవతి తొక్కిసలాటలో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు..కానీ తర్వాతి రోజు నాకు తెలిసింది అని చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది.
ధియేటర్ లో పోలీసులు కలవలేదన్న మాటకు కట్టుబడిన అర్జున్
రేవతి చనిపోయిందని...ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని..మీరు వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు చెప్పారా అనే ప్రశ్న అల్లు అర్జున్ ను అడిగారు పోలీసులు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసులు రాలేదని...తనకేం చెప్పలేదని...మీడియాకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని తాను ప్రెస్ మీట్ లో చెప్పిన విషయానికే అర్జున్ కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు.
అర్జున్ ను ఓ వైపు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బౌన్సర్ల టీం లీడర్ అయిన ఆంటోనిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా ధియేటర్ లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.
అర్జున్ తరపు లాయర్ల బృందం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే ఒక్క లాయర్ ను మాత్రం అర్జున్ ను ప్రశ్నిస్తున్న రూంకు దూరంగా ఉండి చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేవలం అబ్జర్వేషన్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు..దానికి అర్జున్ ఇచ్చిన సమాధానాలపై ఆయన లీగల్ టీం రివ్యూ చేసి పోలీసులు ఏమైనా కొత్త అభియోగాలు మోపేందుకు అవకాశం ఇచ్చమా అన్న అంశంపై పరిశీలన చేసి తదుపరి వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగువకోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంది. వారం అయిపోయినా ఇకా పిటిషన్ దాఖలు చేయలేదు.