సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఓ వైపు... ఏపీకి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వదంతులు మరో వైపు... గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో నటీనటులు గాని దర్శక నిర్మాతలు గాని ఏ చిన్నమాట మాట్లాడినా సరే ఎవరు ఏ విధంగా తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులకు అధ్యక్షుడు విష్ణు మంచు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
మా సభ్యులంతా సహనంతో వ్యవహరించండి...
బహిరంగంగా ఎవరూ ఎటువంటి కామెంట్స్ చేయవద్దు!
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణం విషాదకరం అయితే, ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లు అర్జున్ అరెస్టు వ్యక్తిగతం. అల్లు ఇంటికి కళాకారులు కొందరు వెళ్లి వచ్చారు. ఆ తీరును రాజకీయ నాయకులతో పాటు ప్రేక్షకులు కొంతమంది తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో విష్ణు మంచు కీలక సూచన చేసినట్టు తెలుస్తోంది.
''ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మన సభ్యులు అందరూ సున్నితమైన విషయాలపై తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలలో ఎవరో ఒకరి పక్షం తీసుకోవడాన్ని గానీ చేయవద్దు. ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి అయితే మరికొన్ని విషాదకరమైనవి. ఇటువంటి అంశాలపై మాట్లాడడం వల్ల సమస్యలు పరిష్కారం కావడానికి బదులు సంబంధిత వర్గాలకు మరింత నష్టం చేకూరుతుంది. ఈ తరుణంలో మనమంతా సహనంతో సానుభూతితో ఉండడంతో పాటు ఐకమత్యంగా మెలగడం అవసరం'' అని విష్ణు మంచు చెప్పినట్లు తెలిసింది.
ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరం...
ఏపీకి తరలి వెళ్తుందని వార్తల నేపథ్యంలోనేనా?
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది సంతృప్తికరంగా లేరని, మరోవైపు ఏపీకి పరిశ్రమ రావాలని అక్కడి ఉపముఖ్యమంత్రి ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వడంతో ఇండస్ట్రీ అటువైపు వెళ్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ తరుణంలో 'మా' సభ్యులకు విష్ణు మంచు మరో కీలక సూచన చేసినట్లు సమాచారం అందుతుంది.
Also Read: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్ రాజు
ప్రభుత్వాలు అన్నిటితోను ప్రజాప్రతినిధులు అందరితోనూ కళాకారులకు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయని, వివిధ ప్రభుత్వాలు మద్దతు ఇవ్వడం వల్లే తెలుగు చిత్రసీమ ఈ స్థాయికి చేరుకుందని, మద్రాసు నుంచి హైదరాబాద్ నగరానికి టాలీవుడ్ తరలి రావడంలో - స్థిరపడడంలో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అతి ముఖ్యమైనదని, ప్రతి ప్రభుత్వంతోనూ పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయని మా సభ్యులకు విష్ణు మంచు గుర్తు చేసినట్లు విశ్వసినీయ వర్గాల ద్వారా తెలిసింది. పరోక్షంగా ఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని సూచన చేసినట్లు సమాచారం. సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి ఎదుర్కొందామని మా సభ్యుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన ఒక లేఖ రాశారని తెలిసింది.
Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!