YSRCP Chief Jagan News Strategy:  ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా పరాజయం పాలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో దేశ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఆ పార్టీ ఐదేళ్లు తిరిగే సరికి 11 స్థానాలకు పరిమితం అయింది. ఈ షాక్‌లో ఉన్న కేడర్‌ను, పక్క పార్టీల వైపు చూస్తున్న లీడర్‌ను తమతో ఉంచుకునేందుకు ఎన్నికల పాట అందుకుంది. జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని అప్పటి కూటమిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుందని నూరి పోస్తోంది. దీన్నే జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. 


కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పగ్గాలు చేపట్టి ఆరు నెలలు అవుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తూ వస్తోంది. మరోవైపు పారిశ్రమికవేత్తలను రాష్ట్రంవైపు తిప్పుకునేందుకు పాట్లు పడుతోంది. అమరావతి పట్టాలు ఎక్కిస్తోంది. హామీల అమలు విషయంలో మాత్రం కాస్త తడబాటు ఉంది. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటోంది వైసీపీ. ప్రజల్లో వ్యతిరేకత మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 


ఈ మధ్య కాలంలోనే రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు సరిగా జరగడం లేదని ధర్నాలు చేపట్టింది. విద్యుత్ ఛార్జీలపై కూడా నిరసనలు చేసేందుకు సిద్ధమైంది. ఇలా వివిధ సమస్యలు ప్రజల్లోకి తీసుకెళ్తూనే... గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నగదు బదిలీ పథకాలను గుర్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం ఆపేసిందన్న ప్రచారానికి తెరతీసింది. అందుకే అప్పట్లో జగన్ ఉండి ఉంటే అనే ప్రచారం తీసుకొచ్చింది. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. 


జనవరి నుంచి నియోజకవర్గాల బాట పట్టాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టుగానే కేడర్‌, లీడర్‌లను సమాయత్తం చేసేందుకు అదిగో ఎన్నికలు అన్నట్టు ప్రచారం చేస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఉంది. దీనిపై జేపీసీ స్టడీ చేస్తోంది. అది వచ్చే పార్లమెంట్ సమావేశాలకు ఆమోదం పొందుతుంది. అది అమోదం పొంది అమల్లోకి వస్తే మాత్రం 2027లోనే ఎన్నికలు వస్తాయని చెబుతోందీ వైసీపీ 


అధినేత నుంచి గల్లీ లీడర్ వరకు అంతా అదే ప్రచారం చేస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా చాలా మంది వైసీపీ నేతలు తేరుకోలేకపోతున్నారు. అలాంటి తీర్పు ఎలా ఇచ్చారనే మధనపడుతున్నారు. మరికొందరు కూటమి పార్టీల్లో ఏదో పార్టీలో చేరిపోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆ పని చేశారు కూడా. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్‌లు లేకపోవడంతో ఎవరితో నడవాలో తెలియని పరిస్థితిలో కేడర్ ఉంది. 


ఇలాంటి స్థితిని హ్యాండిల్ చేయలేకుంటే పార్టీకి భారీగా డ్యామేజ్ తప్పదని గ్రహించిన వైసీపీ ఇదిగో ఎన్నికలు అంటూ ప్రచారం చేస్తోంది. ఒక వేళ 2027లో ఎన్నికలు జరిగితే ఇంకా మూడేళ్లే నాలుగేళ్లే ఉందని నేతలంతా జనంలో ఉంటారని వైసీపీ ప్లాన్. కేడర్‌లో కూడా ఉత్సాహం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తే పార్టీ మారే వారి ఆలోచన కూడా మార్చవచ్చని చెబుతున్నారు. అందుకే 2027 ఎన్నికలు అంటే ఇప్పటికే


కూటమి హౌస్‌ఫుల్ అయినందున వైసీపీ నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లు తగ్గుతారని ప్లాన్. ఇలా నలువైపులా ఆలోచించిన వైసీపీ 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తోంది. 


ఇప్పటి వరకు ఈ ప్రచారం ఎంపీలు, కింది స్థాయి నాయకులు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు జగన్ అందుకున్నారు. పులివెందులలో పర్యటించిన జగన్‌ 2027లో ఎన్నికలు వస్తాయని వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అమలు చేయలేదని హామీలు ఇచ్చిన ఇప్పుడు ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారుకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పులివెందుల పర్యటనలో భాగంగా ఆయన కడప నేతలు, కార్పొరేటర్ల, కీలక నేతలతో సమావేశమయ్యారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. 


కష్టాలు శాశ్వతం కావని.. పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లకు భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందని జగన్ అన్నారు. ఇలాంటి టైంలో వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని నేతలకు సూచించారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. కేవలం అబద్దాలు చేప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో కూర్చున్నామన్నారు జగన్. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పని తీరును పోల్చి చూస్తారని అన్నారు. 2027లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.