Telangana News: దేశంలో చైనా ఆక్రమణ, మణిపూర్ అంతర్యద్ధంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మణిపూర్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన కార్పొరేట్ శక్తులు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సాహిస్తున్నాయని అన్నారు. రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై చర్చ చేసేందుకు కేంద్ర పాలకులకు ధైర్యం లేదని చర్చించే వాళ్లు అసలే లేరుంటా కామెంట్ చేశారు. అదే టైంలో మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడ అధునాత ఆయుధాల సరఫరాయే అన్నారు. మణిపూర్‌లో ఖనిజ సంపద దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పలెవా?... తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా? అంటు ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగి వాటిని నియంత్రించాలన్నారు. అప్పుడే దేశంలో శాంతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
యాదవరెడ్డి రాసిన పుస్తకాన్ని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... చాలా మంది సిద్ధాంతాలు చెబుతారు... కానీ పాటించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారని అలాంటి వారిలో యాదవరెడ్డి ఒకరు అని తెలియజేశారు. నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. సురవరం లాంటి వారు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి లాంటి వారు సాఫ్ట్ కోర్ కమ్యూనిస్టులని కొనియాడారు.
దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో పని చేశారని గుర్తు చేశారు. పదవుల కోసం కాకుండా... సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ యాదవరెడ్డి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తెర వెనుక కృషి చేసిన వారిలో ఆయన ఒకరన్నారు. సోనియాగాంధీ చర్చించిన సమయంలో ఆయన కూడా తెలంగాణ ఆవశ్యకత వివరించారన్నారు.
తెలంగాణ బిల్లును ఆమోదించించడంలో జైపాల్ రెడ్డితోపాటు యాదవ రెడ్డి తన బాధ్యత నిర్వహించారన్నారు రేవంత్. ముల్కీ- నాన్ ముల్కీ నుంచి, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు సంపూర్ణ వివరాలతో పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరిస్తూ తెలంగాణ ఉద్యమం చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు.
ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి కూడా ఆ పుస్తకంలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.