BJP Full Support Allu Arjun: హీరో అల్లు అర్జున్‌లో మరోసారి విచారించింది. అల్లు అర్జున్‌ను విచారించడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని ఓ వర్గం వాదిస్తుంటే... లేదు చట్టం ముందు అంతా సమానమే అంటూ మరో వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్‌కు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. కేసు నమోదైనప్పటి నుంచి అరెస్టు దాని తర్వాత జరిగి పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కక్ష సాధించినట్టు వ్యవహరిస్తోందని మండిపడుతోంది. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, మొన్నటికి మొన్న పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చిన వీడియోలను చూసిన వారంతా మరోలా మాట్లాడుతున్నారు. బీజేపీ మాత్రం అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తూ వస్తోంది. గత రెండు మూడు రోజుల్లో ఇది మరింత ఎక్కువైంది. 


మరోసారి మంగళవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేతలు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోందని ఆరోపించారు. ఏమీ లేని కేసులు సాగదీసి తప్పుల మీద తప్పు చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసుపై జాతీయ మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు... ప్రభుత్వ భద్రతా వైఫల్యమై దీనికి కారణమని అన్నారు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు అల్లు అర్జున్‌ చుట్టూ కేసును తిప్పుతున్నారని మండిపడ్డారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. 


ప్రభుత్వంపై రఘునందన్‌రావు ఆగ్రహం 


ప్రభుత్వం తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తోందని ఆరోపించారు రఘునందన్‌రావు . అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని తప్పుపట్టిన ప్రభుత్వం... పోలీసులతో ఎలా ప్రెస్‌మీట్ పెట్టించారని ప్రశ్నించారు. కోర్టులో చూపించాల్సిన ఆధారాలను ఎందుకు బయటపెట్టారని నిలదీశారు. ఇక్కడే ప్రభుత్వం కక్షపూరిత కుట్ర బయటపడుతోందని మండిపడ్డారు. 




సినిమా ఇండస్ట్రీపై కక్ష కట్టారా: ఈటల


కిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఈ ఉదయం పరామర్శించారు. ఆయన తండ్రి భాస్కర్‌కు ధైర్యం చెప్పారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్‌... జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. సినిమా, రాజకీయ, క్రికెట్ ప్రముకులు ఎక్కడకు వెళ్లినా మాస్ ఫాలోయింగ్ ఉంటుందని అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ విషయంలో కక్ష కట్టిందా అన్నట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసు నడుస్తున్నటైంలో కావాలని సెలబ్రెటీలను తీసుకొచ్చి స్టేషన్‌లో గంటలు గంటలు కూర్చోబెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్‌ కేసును ఆసరాగా తీసుకొని మొత్తం సినిమా పరిశ్రమనే ప్రభుత్వం టార్గెట్ చేసిందా అన్నట్టు  అనుమానం కలుగుతోందని ఆరోపించారు. 


జరిగిన ఘటన బాధాకరమన్న ఈటల రాజేందర్‌.... భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవడం, శ్రీతేజ్‌ వైద్య ఖర్చులు పూర్తిగా చెల్లించే బాధ్యతను అల్లు అర్జున్ తీసుకోవాలని సూచించారు. ఇకపై సెలబ్రెటీలు టూర్‌లు ఉండేటప్పుడు దానికి తగ్గట్టుగానే భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.  


Also Read: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు