Breaking News Live: మర్రిపాడులో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Mar 2022 08:13 PM
మర్రిపాడులో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి 

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడు పేట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. వెలిగొండ అటవీ ప్రాంతం నుంచి ఈ చిరుతపులి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. చిరుత పులి రోడ్డు దాటుతున్న సమయంలో ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో ఓ చిరుతపులి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందడం గమనార్హం.




 

KCR In Kolhapur: కొల్హాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కాసేపట్లో పూజలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు. కొల్హాపూర్‌ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారికి కాసేపట్లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. లక్ష్మీ దేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ దేవాలయం ముఖ్యమైనది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదిగా దీన్ని చెప్పుకుంటారు.

3 Capitals in Assembly: ఏపీ అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ కాసేపట్లో

కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి స్వల్పకాలికంగా కీలక చర్చ జరగనుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరగనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చర్చను ప్రారంభించనున్నారు.


Loksabha Updates: లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

లోక్ సభలో నేడు టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిపై చర్చ జరపాలని స్పీకర్ పోడియం వద్ద నామా నాగేశ్వరరావు నిరసన తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు అందరూ నినాదాలు చేశారు. అయినా చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో అందరూ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

TS High Court: తెలంగాణ హైకోర్టుకు 10 మంది కొత్త జడ్జిలు

తెలంగాణ హైకోర్టులో కొత్తగా 10 మంది కొత్త న్యాయ‌మూ‌ర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు హాల్‌లో 10 మంది కొత్త జడ్జీలతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ప్రమాణం చేయించారు. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం 19 మంది జడ్జీలు ఉండగా.. వారికి కొత్త న్యాయమూర్తులు 10 మంది అదనంగా వచ్చి చేరారు. కొత్త న్యాయమూర్తులుగా కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్. శ్రవణ్ కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ. సంతోష్ రెడ్డి, దేవరాజ్ నాగార్జున ప్రమాణం చేశారు.

పెళ్లి బృందం ఆటో బోల్తా, ఇద్దరి పరిస్థితి విషమం

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‎లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందంతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్

* మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేల కీలక మీడియా సమావేశం
* రాష్ట్రంలో అతిపెద్ద మద్యం స్కాంపై సంచలన అంశాలు బయట పెడతామంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు
* మూడేళ్లలో జరిగిన అధికారిక దోపిడీపై కీలక అంశాలతో ప్రెస్ మీట్
* జె బ్రాండ్స్ నుంచి అధిక ధరల వరకు మూడేళ్ల మద్యం అక్రమాలను బయటపెడతామంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు

Background

ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి (మార్చి 24) వచ్చే 5 రోజుల పాటు వర్ష సూచన ఏమీ లేదు. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 


మరోవైపు, ఏపీలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. నిన్న అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద  తీరాన్ని దాటింది. దీని ప్రభావం స్వల్పంగా ఏపీపైనా కనిపించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడింది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ. దాకా వీచింది.


ఇవి పూర్తిగా అకాల వర్షాలని.. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, పెద్ద చెట్ల కింద​, విద్యుత్ స్తంభాల కింద ఉండటం అంత మంచిది కాదని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక నేటి నుంచి మధ్యాహ్నం కాస్త తేమ, ఉక్కపోత ఉండే అవకాశం ఉంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
Telangana Weather: తెలంగాణలో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతల నుంచి తాజా వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికంగా మహబూబ్ నగర్, మెదక్‌లలో 39.6 డిగ్రీలుగా నమోదైంది. మొన్నటివరకు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు చేసిన నల్గొండలో 39.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట ప్రాంతాల్లో వర్షం కురిసినట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. 23న అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 18.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బాగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు బంగారం ధర గ్రాముకు రూ.40 తగ్గింది. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.1,500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,670 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,900 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,900 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,670గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,900 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.