Koneru Humpy Secures Second World Rapid Chess Title | తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది.  ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో కోనేరు హంపి విజేతగా నిలిచింది. ర్యాపిడ్ చెస్ టోర్నీలో కోనేరు హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌గా అవతరించింది. 






రికార్డు స్థాయిలో రెండోసారి ఈ ఘనత
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ కోనేరు హంపి నెగ్గడం ఇది రెండోసారి. 2019లోనూ ఆమె టైటిల్ నెగ్గింది. కాగా, చైనాకు చెందిన గ్రాండ్‌ మాస్టర్ జు వెంజున్ తరువాత ఒకటి కంటే ఎక్కువసార్లు వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా హంపి అరుదైన ఘనత సాధించింది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో పరిపెట్టుకన్నారు. సెప్టెంబర్ లో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో పురుషుల జట్టుతో పాటు భారత మహిళలు స్వర్ణం సాధించారు. ఆ జట్టులో ద్రోణవల్లి హారిక ఉన్నారని తెలిసిందే.


కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంఫియన్‌గా నిలవడంపై భారత వెటరన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. విజేత కోనేరు హంపికి అభినందనలు. చివరి రౌండ్లో హంపి తన క్లాస్ చూపించింది. అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించావని విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసించారు.






పురుషుల విభాగంలో విజేతగా వోలాదర్ ముర్జిన్‌
తెలుగు తేజం, భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్ ఇరిగేశికి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో నిరాశే ఎదురైంది. 9 రౌండ్లు పూర్తయ్యేవరకు అగ్రస్థానంలో ఉన్న అర్జున్ చివర్లో ఓటమి ఎదురైంది. ర్యాపిడ్‌ చెస్ టోర్నీలో పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలాదర్ ముర్జిన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన టీనేజర్ గ్రాండ్‌ మాస్టర్ 10 పాయిట్లు సాధించి విజేతగా నిలిచాడు. అర్జున్ ఇరిగేశి (9 పాయింట్లు) ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా, సెప్టెంబర్ నెలలో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో భారత్ ను ముందుండి నడిపిన ప్లేయర్‌గా అర్జున్ పేరు తెచ్చుకున్నాడు. భారత్‌ తొలి చెస్ ఒలంపియాడ్ స్వర్ణం నెగ్గడంతో అర్జున్, గుకేశ్ కీలక పాత్ర పోషించారు.


Also Read: Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..