ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హెచ్చరికలను జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్ లోని పలు వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా(CERT-In) తెలిపింది. ఈ లోపాలు తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటి ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆయా స్మార్ట్ ఫోన్లలోని కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.    


ఏ ఆండ్రాయిడ్ ఫోన్లకు సైబర్ ముప్పు ఉందంటే?


ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ 10 నుంచి మొదలుకొని ఆండ్రాయిడ్‌ 13 వరకు ఈ లోపాలను గుర్తించినట్లు CERT-In వెల్లడించింది. ఫ్రేమ్‌ వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌ టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌ డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌ లో పలు తప్పుల కారణంగా ఈ సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఈ లూప్ హోల్స్ ను బేస్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆయా స్మార్ట్ ఫోన్లలోని ముఖ్యమైన డేటా అంటే, ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై దాడి చేసినప్పుడు, ఆయా ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తారని చెప్పింది. దీని ద్వారా ముఖ్యమైన సమాచారం తస్కరించి, ఫోన్ పని చేయకుండా చేస్తారని వెల్లడించింది.   


సైబర్ దాడుల ముప్పును ఎలా ఎదుర్కోవాలంటే?  


ఆండ్రాయిడ్‌ 10 నుంచి ఆండ్రాయిడ్‌ 13 వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు సైబర్ దాడులకు అవకాశం లేకుండా  ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌ డేట్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది.


1. ఇందుకు డివైజ్‌ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి 'సిస్టమ్​' అనే ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి.


2. ఆ తర్వాత 'సిస్టమ్​ అప్​డేట్స్'లోకి వెళ్లాలి.


3. ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి.


4. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.


5. ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ  అప్‌ డేట్‌ ప్రక్రియ కొనసాగించాలి.   


వినియోగదారులకు కీలక సూచనలు 


1. విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.


2. ఫోన్‌లో మాల్వేర్‌ ఉందా?లేదా? అని తెలుసుకునేందుకు సెక్యూరిటీ యాప్‌ను వినియోగించాలి.


3. గుర్తు తెలియని ఈమెయిళ్లు, అటాచ్‌మెంట్లను తెరవకూడదు.   


4. స్ట్రాంగ్ పాస్‌ వర్డ్‌ తో పాటు యాప్స్‌ లో టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ ను వాడాలి.  


5. ఎప్పటికప్పుడు మీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి..


6. డేలా బ్యాక్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ పోయినా? లేదంటే దొంగిలించబడినా, మీరు మీ డేటాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.   


మొత్తంగా సైబర్ దాడుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్రం సూచించింది. 


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial