ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఆపిల్ ఫోన్లు మాత్రమే కాదు, ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్టుకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ధర ఎంత అయిన ఫర్వాలేదు. ఆపిల్ ప్రొడక్టు అయితే చాలు అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఆపిల్ కంపెనీ తయారు చేసిన  Apple iPhone 14,  Apple iPhone 14 Pro పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఫోన్లలో పలు రకాల బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడుతున్నారు.


iPhone 14లో బ్యాటరీ సమస్యలు


చాలా మంది iPhone 14, iPhone 14 Pro వినియోగదారులు బ్యాటరీ సమస్యలను గుర్తించారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసి ఏడాది గడవక ముందే, గణనీయంగా బ్యాటరీ లైఫ్ పడిపోతున్నట్లు గమనించారు. అంతేకాదు, తమ ఫోన్లలోని బ్యాటరీ సమస్యలను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. "నా iPhone 14 ప్రో బ్యాటరీ లైఫ్ చాలా పేలవంగా ఉంది. ఉదయం 8 గంటలకు ఫుల్ ఛార్జ్ చేశాను. సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో అయిపోయింది” అని ఐఫోన్ 14 ప్రో వినియోగదారుడు డేనియల్ వెల్లడించారు. WSJ కాలమిస్ట్ జోవన్నా స్టెర్న్ కూడా తన iPhone 14లోని బ్యాటరీ సమస్యల గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.  "నా iPhone 14 Pro ఒక సంవత్సరంలో గానే  బ్యాటరీ సామర్థ్యం 88 శాతానికి తగ్గింది. నా ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఈ సమస్య తలెత్తిందా? ఈ సమస్యకు 450 ఛార్జ్ సైకిల్స్ కారణమా? లేక ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఇలా జరుగుతోందా? బ్యాటరీలో ఏదైనా సమస్య ఉందా?" అని ట్వీట్ చేసింది.






ఆపిల్ చెప్పింది ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి?


గత కొద్ది రోజులుగా ఆపిల్ ఐఫోన్ 14 బ్యాటరీ సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్పింది అనే విషయంపై చర్చ జరుగుతోంది. iPhone బ్యాటరీలు 500 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ తర్వాత వాటి ఛార్జింగ్ పరిమితిని 80 శాతానికి పరిమితం చేయాలని Apple గతంలోనే సూచించింది. అయితే, 500 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ పూర్తికాక ముందే బ్యాటరీ లైఫ్ టైమ్ భారీగా తగ్గిపోతోంది. అయితే, రాబోయే ఐఫోన్ 15 సిరీస్ ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే బ్యాటరీ పరిమాణం 10 నుంచి  18 శాతం పెరుగుదల ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య రాబోయే ఫోన్లలో ఉండదనే టాక్ నడుస్తోంది. కానీ, ప్రస్తుత వినియోగదారుల సమస్యలను ఆపిల్ కంపెనీ ఎలా పరిష్కరిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బ్యాటరీ సమస్యలపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం పైనా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial