77 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డ్ వచ్చింది. దీనిపట్ల మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో డైరెక్టర్లు ప్రీతి రెడ్డి, భద్రా రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక మంత్రి మల్లారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా తనకు ఆ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని మెడికో విద్యార్థులతో పంచుకున్నారు.


ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిఉన్న జీవితం అంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని అన్నారు. కష్టపడితే ఎంతటి విజయాన్ని అయిన సాధించవచ్చు అనే దానికి ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. మల్లారెడ్డి పాలు, పూలు అమ్మిన అనే డైలాగ్ ను గుర్తు చేశారు. కాలేజీలు స్థాపించి ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రయత్నం చేస్తే ఎవరైనా చరిత్ర రాయవచ్చని అన్నారు. ఇన్ని కాలేజీలు పెడతానని, మెడికాలేజీలు ఉంటాయని తాను ఏనాడూ అనుకోలేదని అన్నారు.


ప్రయత్నం చేసి విజయం సాధించానని అన్నారు. ప్రతి రోజు విద్యార్థులు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వాలని అన్నారు. అదొకటే సూత్రమని అన్నారు. ఇంత మంది డాక్టర్ల మధ్య విజనరీ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని మల్లారెడ్డి అన్నారు.


కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా.. మెడికల్ కాలేజీలు పెట్టినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డు అందుకున్నా. ఓన్లీ మల్లారెడ్డి. మీ అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరా. ఇక నా మిగిలిన జీవితం అంతా ప్రజా సేవనే’’ అని మల్లారెడ్డి అన్నారు.