మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ‘ఆచార్య’ చిత్రానికి మించిన పరాభవం ఎదుర్కొంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెటిజన్లతో పాటు సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని సీన్లను మీమ్స్ గా రూపొందిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.


మీమ్స్ కు వ్యతిరేకంగా కాపీరైట్ స్ట్రైక్స్


ఈ ట్రోలింగ్ ను తట్టుకోలేని చిత్రబృందం, నెట్టింట్లో మీమ్స్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మీమ్స్‌లో ఉపయోగిస్తున్న సినిమా క్లిప్స్, ఫోటోలకు కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం పంపిస్తోంది. అకౌంట్స్ బ్లాక్ చేయిస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఈ నిర్ణయం పట్ల మీమ్ కమ్యూనిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చిత్రబృందం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. సినిమా విడుదల తర్వాత మెమర్‌లు  పోస్ట్ మీమ్స్, వాటికి వ్యతిరేకంగా వచ్చిన  కాపీరైట్ స్ట్రైక్స్ సంబంధించిన స్క్రీన్‌ షాట్లను షేర్ చేస్తున్నారు. అటు ఈ అంశంపై ‘భోళా శంకర్‘ టీమ్ ఎలాంటి వివరణ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.






‘భోళా శంకర్’ మూవీపై ప్రేక్షకుల విమర్శలు   


ఇక ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి నటించిన పలు చీప్ సీన్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. జబర్దస్త్ కామెడీ, పవన్ మేనరిజం, శ్రీముఖి ఖుషీ నడుము ప్రదర్శన ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి. ఈ సినిమాలో చిరంజీవి రొమాన్స్, స్టెప్పులు అస్సలు ఆకట్టుకోకపోవగా విమర్శల పాలయ్యాయి.  ఆయన వయసు హీరోలు చేస్తున్న  సినిమాలతో ‘భోళా శంకర్’ ను పోల్చి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు ఎంతో హుందాగా, తమ వయసుకు తగిన సినిమాలను చేస్తుంటే, మెగాస్టార్ మాత్రం కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ తో చిర్రెత్తిస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి సందేశం, గొప్పతనం లేని ఓ సాదాసీదా ‘వేదాళం’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ చేసినా ఆయన వయసుకు తగినట్లు కథను మలిచితే బాగుంటుంది గానీ, లేని పైతన్యాన్ని రుద్దడం ఎందుకనే టాక్ నడుస్తోంది.


అటు ఈ సినిమా తర్వాత చిరంజీవికి, నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆర్థికంగా నష్టపోయిన తమను చిరంజీవి ఆదుకోలేదని నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను సదరు నిర్మాత ఖండించారు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవిగా ఆయన కొట్టిపారేశారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ‘భోళాశంకర్’ మూవీ విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని  ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించగా, చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ కనిపించింది. యువ హీరో సుశాంత్ కీలకపాత్రలో కనిపించారు. 


Read Also: పవన్‌పై చంద్రబాబు సెటైర్లు - ‘వ్యూహం’ టీజర్ 2లో ఎవర్నీ వదలని ఆర్జీవీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial