నటసింహ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని, దసరా కానుకగా అక్టోబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ కథ విషయంలో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది 'స్వామి' సినిమాకి అనధికారిక రీమేక్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ పుకార్లపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.


2004లో బాలయ్య సోదరుడు, దివంగత నందమూరి హరికృష్ణ నటించిన చిత్రం 'స్వామి'. ఇందులో మీనా, ఉమ, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహింహించిన ఈ చిత్రానికి పోసాని కృష్ణ మురళి కథ - మాటలు అందించారు. మెడికల్ కాలేజీలో చేరిన తన కవల సోదరీమణులను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఓ యువకుడు రేప్ చేసి చంపేస్తాడు. దీనికి స్వామి దంపతులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? కోర్టుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది ఈ సినిమా స్టోరీ. ఇదే లైన్ తో ఇప్పుడు 'భగవంత్ కేసరి' చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. 


'భగవంత్ కేసరి' సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. ధమాకా బ్యూటీ శ్రీలీల ఆయన కూతురి పాత్రలో కనిపించనుంది. హీరోని ఢీకొట్టే విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పోషిస్తున్నారు. తండ్రీ-కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో, సిస్టర్ సెంటిమెంట్ తో తీసిన 'స్వామీ' సినిమాతో పోలికలు పెడుతున్నారు. బాలకృష్ణ తన అన్నయ్య చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ కొందరు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన చిత్ర బృందం.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 


''ఆ వార్తలు నిజం కాదు. అసలు నిజం ఏంటంటే, అక్టోబర్ 19వ తేదీ భారీగా ఉండబోతోంది. NBK 'భగవంత్ కేసరి' సినిమా చూసి ప్రతి ఒక్కరూ బిగ్ స్క్రీన్‌లలో మునుపెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు జరుపుకుంటారు'' అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో హరికృష్ణ 'స్వామి' సినిమాకి బాలయ్య చిత్రాన్ని అసలు సంబంధమే ఉండదని.. ఏ సినిమాకు రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. 






'భగవంత్ కేసరి' బాలకృష్ణ కెరీర్ లో 108వ చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో ఎన్నడూ చూడని విధంగా నటసింహాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. 'అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా యేళ్లు యాదుంటది' అంటూ బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటి వరకు ఎక్కువగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసిన బాలయ్య.. ఈసారి తెలంగాణ నేపథ్యంలో సాగే కథతో అలరించడానికి రెడీ అవుతున్నారు. 


హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'భగవంత్ కేసరి' సినిమాని 2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 


Also Read: Independence Day 2023: దేశభక్తిని చాటి చెప్పే తెలుగు సినిమా పాటలు ఇవే - ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial