మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ఇది 'వేదాళం' అనే తమిళ్ సినిమాకి రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. వసూళ్ల పరంగా టాలీవుడ్ లో అతి పెద్ద పరాజయాల లిస్టులో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో అంతటి దారుణమైన ఫలితాన్ని చవిచూసిన ఈ మెగా మూవీని, ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


'భోళా శంకర్' సినిమాని ఆర్.కె.డి స్టూడియోస్ అనే బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ హిందీలో డబ్బింగ్ చేసింది. చిరంజీవి పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. హిందీ వెర్షన్ ను ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్ ను సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. 



'భోళా శంకర్' తెలుగు టీజర్‌ను హిందీలో రిలీజ్ చేశారు. చిరు స్టైల్, గ్రేసు, డైలాగ్స్ నార్త్ జనాలను అలరిస్తున్నాయి. మెగాస్టార్ వాయిస్ కి మనం అలవాటై పోవడంతో జాకీ ష్రాఫ్ డబ్బింగ్ తెలుగు ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం జాకీ వాయిస్ పెర్ఫెక్ట్ గా సూట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగులో తీవ్ర నిరాశ పరిచిన ఈ చిత్రం హిందీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. 


గతేడాది చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ పొలిటికల్ యాక్షన్ ఉత్తరాదిలో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు 'భోళా శంకర్' మూవీని బాలీవుడ్ లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే 'వేదాళం' హిందీ డబ్బింగ్ మూవీని యూట్యూబ్ లో చాలామంది చూసేసి ఉంటారు. దానికి రీమేక్ గా రూపొందిన చిరంజీవి సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.


అన్నాచెల్లెల అనుబంధం, హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో 'భోళా శంకర్' సినిమా తెరకెక్కింది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటించగా, సోదరి పాత్రను కీర్తి సురేష్ పోషించింది. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో కనిపించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి మ్యూజిక్ అందించారు. 


నిజానికి 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు, మెగాభిమానులు కూడా నచ్చలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇకపై రీమేక్స్ చేయొద్దంటూ ఫ్యాన్స్ మెగాస్టార్ కు రిక్వెసులు పెడుతున్నారంటే ఈ సినిమా రిజల్ట్ అర్థం చేసుకోవచ్చు. దాదాపు దశాబ్దం తర్వాత మెగాఫోన్ పట్టిన మెహర్ రమేష్‌.. మెగా గోల్డెన్ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఔట్ డేటెడ్ కంటెంట్‍ ని అంతకంటే ఔట్ డేటెడ్ టేకింగ్ తో నిరాశ పరిచారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్రెండ్ చూస్తుంటే ఏ దశలోనూ ఈ సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఫైనల్ ఈ రీమేక్ మూవీ ఎంత వసూలు చేస్తుందో చూడాలి. 


Also Read: 'భగవంత్ కేసరి'కి గుడ్ బై చెప్పిన బాలీవుడ్ యాక్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial