నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్‌ కేసరి’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, బాలీవుడ్ స్టార్ అర్జున్‌ రాంపాల్‌ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు.


‘భగవంత్‌ కేసరి’ సినిమాలో రాహుల్ సంఘ్వి అనే ప్రతినాయకుడి పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నారు. తన పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని నటుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, ఎమోషనల్ ట్వీట్ చేసారు. ''భగవంత్ కేసరి సినిమాలో నా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. నా ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఈ చిత్రీకరణ చాలా బాగా జరిగిందని నేను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలను. మా అన్నయ్య బాలకృష్ణ ఎనర్జీ లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. మీ అద్భుతమైన శక్తికి, ప్రేమకి మరియు హోరాలో నా ఎడ్యుకేషన్ కు థ్యాంక్యూ. లవ్ యూ బ్రదర్ నా ప్రియమైన తమ్ముడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు. నువ్వు క్రేజీ, కూల్ అండ్ సూపర్ టాలెంటెడ్. యువ నిర్మాత సాహు ఎంతో సహనంతో భగవంత్ కేసరి బృందానికి సపోర్ట్ గా నిలిచారు. గుడ్ బై టీమ్. అక్టోబర్ 19న థియేటర్లలో కలుద్దాం. ప్రేమతో మీ రాహుల్ సంఘ్వి'' అని అర్జున్‌ రాంపాల్‌ రాసుకొచ్చారు. 


ఈ సందర్భంగా హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ సెట్ లో బాలకృష్ణ, అనిల్ రావిపూడిలతో కలిసి ఉన్న ఫోటోలను అర్జున్‌ రాంపాల్‌  ట్విట్టర్ లో షేర్ చేసారు. దీనికి దర్శకుడు అనిల్ స్పందిస్తూ.. ''భగవంత్ కేసరి vs రాహుల్ సంఘ్వి.. ఇది బిగ్ స్క్రీన్స్ మీద మాసివ్ ఫీస్ట్ కానుంది. అర్జున్ రాంపాల్ సార్ మీరు ఈ పాత్ర పోషించినందుకు మాకు గౌరవంగా భావిస్తున్నాం. అక్టోబరు 19న థియేటర్లలో ప్రేక్షకులకు చూపించేవరకు వేచి ఉండలేకపోతున్నాను'' అని పేర్కొన్నారు. 






కాగా, 'భ‌గ‌వంత్ కేస‌రి' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవ‌లే ఓ భారీ యాక్ష‌న్ షెడ్యూల్ ను పూర్తి చేసారు. స్టంట్ మాస్ట‌ర్ వెంక‌ట్ నేతృత్వంలో ప్ర‌త్యేకంగా వేసిన ఓ సెట్ లో బాల‌య్య‌ - అర్జున్ రాంపాల్ లపై హై ఓల్డేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారని సమాచారం. కుటుంబ అనుబంధాలు, వినోదం కలబోతగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లో ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. 


ఇందులో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపించడమే కాదు, తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. ఆయన క్యారక్టరైజేషన్ డిఫెరెంట్ గా కొత్తగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’, ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్‌ కేసరి. ఈపేరు శానా యేండ్లు యాదుంటది’ అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి అలరించారు. 


‘భగవంత్‌ కేసరి’ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సి. రాంప్రసాద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, రాజీవ్‌  ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా 2023 అక్టోబరు 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ‘అఖండ' 'వీర సింహారెడ్డి' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి.


Also Read: ‘రోలెక్స్‌’ రాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్య! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial