ఎందరో మహనీయుల కృషితో, త్యాగఫలంతో మన మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజును కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా భారతీయులంతా వేడుకగా జరుపుకుంటాం. ఇక స్వాతంత్య్రం గురించి తెలియజెప్పి, దేశభక్తిని రగిలించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. దేశ భక్తితో పాటు అసలైన స్వాతంత్ర్యం, స్వేచ్చ, సామాజిక అసమానతలు, పేదరికం, వివక్ష వంటి వాటిని ప్రస్తావించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటి చెప్పి, సినీ అభిమానుల్లో చైతన్యం తీసుకొచ్చిన తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


'తెలుగు వీర లేవరా' - అల్లూరి సీతారామరాజు (1974)
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో రూపొందిన చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీకి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయన మరణాంతరం కొంత భాగం సినిమాని కృష్ణ తెరకెక్కించగా, పోరాట సన్నివేశాలను కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. మన్యం వీరుడి స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా కోసం ఆదినారాయణ రావు స్వరపరిచిన 'తెలుగు వీర లేవరా' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఎక్కడో చోట మారుమోగిపోతూనే ఉంటుంది. ఈ దేశభక్తి గీతాన్ని రాసినందుకు గాను శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది.



'జననీ జన్మ భూమిశ్చా' - బొబ్బిలి పులి (1982)
విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు – దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'బొబ్బిలి పులి'. సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని, లంచగొండితనాన్ని భరించలేకపోయిన ఓ మిలటరీ అధికారి.. నక్సలైట్ గా మారి సంఘ విద్రోహ శక్తులను ఎలా అంతమొందించాడనేది ఈ సినిమా కథ. ఇందులో ఆర్మీ నేపథ్యంలో 'జననీ జన్మభూమిశ్చా' పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతంగా నిలిచిపోయింది. జేవి రాఘవులు కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంతో మందిని చైతన్య వంతం చేసింది.. భావోద్వేగానికి గురి చేసింది.



'పాడవోయి భారతీయుడా' - వెలుగు నీడలు (1961)
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు - మహానటి సావిత్రి ప్రధాన పాత్రల్లో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన సినిమా 'వెలుగు నీడలు'. ఈ చిత్రంలోని 'పాడవోయి భారతీయుడా' పాట సినీ లోకానికి దేశ భక్తిని చాటి చెప్పింది. పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ గీతానికి శ్రీ శ్రీ లిరిక్స్ రాశారు. గంటసాల - పి. సుశీల కలిసి ఆలపించారు. ఇది తెలుగులో వచ్చిన మొదటి పేట్రియాటిక్ సాంగ్ గా పేర్కొంటారు. 



'పుణ్యభూమి నాదేశం' - మేజర్ చంద్రకాంత్ (1993)
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ 'మేజర్ చంద్రకాంత్'. కమర్షియల్ హంగులతో కూడిన ఈ దేశ భక్తి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి' పాట క్లాసిక్ అని చెప్పాలి. ఈ జెనరేషన్ వారికి దేశ భక్తి గీతం అంటే ముందుగా గుర్తొచ్చే పాట ఇదేనని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, జాలాది రాజా రావు అద్భుతమైన సాహిత్యం రాశారు. 



'భారతమాతకు జేజేలు' - బడిపంతులు (1972)
ఎన్టీఆర్, అంజలి, రాజబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బడిపంతులు'. పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన 'భారతమాతకు జేజేలు' పాట ఇప్పటికీ రిపబ్లిక్ డే , ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలలో వినిపిస్తూ ఉంటుంది. 



'మేమే ఇండియన్స్' - ఖడ్గం (2002)
కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 



'దేశం మనదే తేజం మనదే' - జై (2004)
తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 



'దేశమంటే మట్టి కాదోయ్' - ఝుమ్మంది నాదం (2010)
మంచు మనోజ్, తాప్సి పన్ను జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ లవ్ స్టోరీ 'ఝుమ్మంది నాదం'. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ, 'దేశమంటే మట్టి కాదోయ్' అనే దేశభక్తి గీతం అందరినీ ఆకట్టుకుంది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కలిసి పాడారు. 



'ఎత్తరా జెండా' - RRR (2022)
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్ లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. హరీష్ కొరియోగ్రఫీ చేశారు.



'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ (2020)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని 'సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారు' అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. భారత సైన్యానికి నివాళిగా ఈ గీతాన్ని రూపొందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కి ట్యూన్ సమకూర్చడమే కాదు, స్వయంగా లిరిక్స్ రాసి ఆలపించడం విశేషం. 



ఇవే కాకుండా జనగణమన' (మేజర్), 'సైనికా' (నా పేరు సూర్య), 'వందే మాతరం' (బాబీ), 'జననీ జన్మ భూమి' (సబ్బు), 'ఐ యామ్ ఇండియన్' (బద్రి), సుభాష్ చంద్ర బోస్ టైటిల్ సాంగ్, 'ఆకాశం గుండెల్లో' (సుల్తాన్), 'భారత నారిను నైను బందీనై' (నేటి భారతం), 'ఏ దేశమేగినా' (అమెరికా అబ్బాయి), 'నీ ధర్మం నీ సంఘం నీ దేశం' (కోడలు దిద్దిన కాపురం), 'నా జన్మ భూమి ఎంత అందమైన దేశమో' (సిపాయి చిన్నయ్య) లాంటి మరికొన్ని దేశ భక్తిని చాటి చెప్పే పాటలు కూడా ఉన్నాయి.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial