ఈరోజుల్లో సినిమాల రేంజ్‌లో వెబ్ సిరీస్‌లకు కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఒక సీజన్ తర్వాత మరో సీజన్ అంటూ విడుదల అవుతున్న సిరీస్‌ల కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలయ్యి సిరీస్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది ‘మేడ్ ఇన్ హెవెన్ 2’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన ‘మేడ్ ఇన్ హెవెన్’కు ఇది రెండో సీజన్‌గా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఫస్ట్ సీజన్ హిట్ అయినా కూడా సెకండ్ సీజన్ కోసం నటీనటులంతా బాగానే ప్రమోషన్స్ చేశారు. అయితే ఏడు ఎపిసోడ్స్ ఉన్న ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్‌కు ఏకంగా బీఆర్ అంబేద్కర్ మనవడి దగ్గర నుండే ప్రశంసలు అందాయి. కేవలం ఎపిసోడ్‌కు మాత్రమే కాదు రాధికా ఆప్టే నటనను కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు ప్రకాశ్ అంబేద్కర్.


బీఆర్ అంబేద్కర్ వెనకబడిన సామాజిక వర్గానికి స్వేచ్ఛను తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన బాటలోనే మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా నడుస్తున్నారు. యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లోని రాధికా ఆప్టే ఎపిసోడ్ ఫోటోను పెట్టి ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తనకు ఏం అనిపించిందో చెప్పుకొచ్చారు ప్రకాశ్. నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిసోడ్‌లో రాధికా.. పల్లవి అనే ఒక దళిత యువతి పాత్రను పోషించింది.


పల్లవి చెప్పింది నిజం..
‘దళిత స్త్రీ పల్లవి క్యారెక్టర్‌, ఆ క్యారెక్టర్‌కు సంబంధించిన ప్రతీ ఒక్క అంశం నాకు విపరీతంగా నచ్చాయి. ఈ ఎపిసోడ్‌ను చూసిన వాంచిట్స్, బహుజనులు మీ గుర్తింపును నిర్ధారించినప్పుడే రాజకీయ ప్రాముఖ్యతను పొందగలుగుతారు. అంటే పల్లవి చెప్పినట్టుగా ‘ప్రతీది పాలిటిక్స్ గురించే కదా..!' అంటూ ఎపిసోడ్‌లోని ఒక సీన్‌ను ఫోటో తీసి షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు ప్రకాశ్ అంబేద్కర్. తను చేసిన ట్వీట్‌లో రాధికా ఫోటోతో పాటు ఎపిసోడ్‌లో బుద్ధుడు, బీఆర్ అంబేద్కర్ పక్కపక్కనే ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లోని దర్శకుడు నీరజ్ తెరకెక్కించిన ఎపిసోడ్, అందులో రాధికా ఆప్టే క్యారెక్టర్.. ప్రకాశ్‌ను ఎంతగా మెప్పించాయో అర్థమవుతోంది. 


నీరజ్ గైవాన్ మార్క్..
‘మేడ్ ఇన్ హెవెన్ 2’లోని 5వ ఎపిసోడ్‌లో రాధికా ఆప్టే.. పల్లవి మెంకే అనే ఒక దళిత యువతి పాత్రలో కనిపించింది. ఒక లాయర్, రైటర్ పాత్రలో తాను కనిపించింది. అయితే దళిత యువతి అయినా కూడా తన కులం కానీ వాడిని పెళ్లి చేసుకుంటుంది పల్లవి. ఇలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్‌ను నీరజ్ గైవాన్ అద్భుతంగా రాసుకున్నాడు. అలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్‌కు రాధికా తన యాక్టింగ్‌తో ప్రాణం పోసింది. ప్రకాశ్ అంబేద్కర్ ఇచ్చిన ప్రశంసలకు నీరజ్ స్పందించాడు. ‘థాంక్యూ సార్’ అంటూ ప్రకాశ్‌కు రిప్లై ఇచ్చాడు. ఇది మాత్రమే కాకుండా 2015లో నీరజ్ తెరకెక్కించిన ‘మసాన్’ అనే చిత్రంలో కూడా దళితుల గురించి ప్రత్యేకంగా చూపించాడు దర్శకుడు నీరజ్. ఆ సినిమా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు గుర్తుంది అంటే ముఖ్యంగా అందులోని క్యారెక్టర్సే కారణం. ఇలా సందర్భంగా ఉన్న ప్రతీసారి నీరజ్.. వెనకబడిన సామాజిక వర్గాల పాత్రలను తన సినిమాలో చేరుస్తూనే ఉంటాడు.


Also Read: చిరంజీవితో మరో సినిమా తీస్తా - నిర్మాత వాట్సాప్ చాట్ లీక్, అందులో ఏముందంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial