టీమిండియా న్యూజిలాండ్‌తో ఆదివారం రెండో మ్యాచ్ ఆడటానికి సిద్ధం అయింది. పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.


ఈ టోర్నీలో మొదటి విజయం అందుకోవాలనే లక్ష్యంతోనే ఈ రెండు జట్లూ సన్నద్ధం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ఆటగాళ్లు వీరే..


1. రోహిత్ శర్మ: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌటయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. రోహిత్ వైఫల్యంతో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. దీంతో ఆ ఒత్తిడిలో టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో మ్యాచ్‌లో రోహిత్ పెద్దస్థాయిలో కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. రోహిత్ టచ్‌లోకి వచ్చాడంటే.. భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఎందుకంటే సిక్సర్లు అలవోకగా కొట్టగల సామర్థ్యం హిట్ మ్యాన్ సొంతం.


2. విరాట్ కోహ్లీ: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఫాంలోకి వచ్చాడు. విరాట్ అర్థ సెంచరీ కారణంగానే.. భారత్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. బలమైన న్యూజిలాండ్‌పైన కూడా విరాట్ తన ఫాంని కొనసాగించి భారీ స్కోరు చేస్తే.. భారత్ విజయానికి బాటలు వేసినట్లే.


3. రిషబ్ పంత్: పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ అత్యంత కీలకమైన 39 పరుగులు సాధించాడు అయితే ఎప్పటిలాగానే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. కాబట్టి న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పంత్ నిగ్రహం కోల్పోకుండా జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది.


4. జస్‌ప్రీత్ బుమ్రా: భారత జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కొన్ని మంచి డెలివరీలు వేసినప్పటికీ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు. తన బౌలింగ్ కోటా మూడు ఓవర్లలో 22 పరుగులను బుమ్రా సమర్పించాడు. జస్‌ప్రీత్ బుమ్రా.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మంచి బంతులు విసిరి.. మ్యాచ్‌ను గెలిపించాలి.


5. రవీంద్ర జడేజా: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా పాకిస్తాన్ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. అయితే ఒక్కసారి టచ్‌లోకి వచ్చాడంటే జడ్డూ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మనకి తెలియంది కాదు. కాబట్టి కీలకమైన మ్యాచ్‌లో జడేజా మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.


Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?


Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?


Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి