టోక్యో ఒలింపిక్స్‌ ( Tokyo Olympics)లో భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. పోటీల్లో భాగంగా సోమవారం ఉదయం భారత్... డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో గెలిచిన ఇండియా సెమీస్‌లోకి ప్ర‌వేశించింది. సెమీస్‌లో టీమిండియా... అర్జెంటీనాతో త‌ల‌ప‌డ‌నుంది. ఆట రెండ‌వ అర్ధభాగంలో గుర్జిత్ కౌర్ ( Gurjit Kaur) అద్భుత‌మైన గోల్ చేసింది. అయితే ఆట మొత్తం లీడింగ్‌లో ఉన్న ఇండియా ఏకంగా డిఫెండింగ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టు ఒలింపిక్స్‌ చరిత్రలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి.


రాణి రాంపాల్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. గ్రూప్ బీలో టాప్‌లో నిలిచిన ఆస్ట్రేలియాను అనూహ్య రీతిలో ఓడించింది. 22వ నిమిషంలో గుర్జిత్ కౌర్ భార‌త్ త‌ర‌పున ఏకైక గోల్ చేసింది. ఆస్ట్రేలియా జోరుకు భార‌త మ‌హిళ‌లు ఏమాత్రం బెద‌ర‌లేదు. ప్ర‌త్య‌ర్థుల్ని డిఫెన్స్‌లో ప‌డేశారు. దీంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. అడ‌పాద‌డ‌పా ఆసీస్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. భార‌త జ‌ట్టు ధీటుగా ఎదుర్కొంది. గుర్జీత్ డ్రాగ్ ఫ్లిక్ షాట్‌తో చేసిన గోల్ ఇండియాకు బాగా క‌లిసి వ‌చ్చింది.


ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్‌లో అనేకసార్లు పెనాల్టీ కార్నర్లు కొట్టే అవకాశం దక్కింది. కానీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో డిఫెండింగ్ ఛాంపియన్ విఫలమైంది. స‌ర్కిల్‌లో చుట్టుముట్టిన ఆసీస్ క్రీడాకారిణులు గోల్ పోస్టుపై ఇండియా క‌న్నా ఎక్కువ షాట్స్ ఆడారు. కానీ భార‌త మ‌హిళ‌లు మాత్రం ఆసీస్‌కు ఎక్క‌డా త‌లొగ్గ‌లేదు. మూడో క్వార్ట‌ర్స్‌లో ఆసీస్ జోరు పెంచినా.. రాణి రాంపాల్ బృందం ధైర్యంగా వారిని అడ్డుకున్న‌ది. రియో ఒలింపిక్స్‌లో ఇదే ఆస్ట్రేలియా జ‌ట్టు చేతిలో 6-1తో ఓడి సెమీస్ ఆశ‌లు చేజార్చుకున్న భార‌త జ‌ట్టు ఈసారి ఫ‌లితాన్ని తిర‌గ‌రాయ‌డం అద్భుతం. దీంతో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.


Also Read: PV Sindhu Wins Bronze Medal: సాహో ‘కాంస్య’ సింధు... వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు..


ఈ సారి మ‌హిళ‌ల జ‌ట్టు నాకౌట్ ద‌శ‌లోకి ప్ర‌వేశించి చ‌రిత్ర సృష్టించింది. పూల్ ఏలో ఇండియా జ‌ట్టు నాలుగ‌వ స్థానంలో నిలిచింది. గ్రూపు స్టేజ్‌లో రెండు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌ను న‌మోదు చేసింది. అయితే ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో నిజానికి ఆస్ట్రేలియానే ఫెవ‌రేట్‌. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ టూ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇండియా మ‌ట్టిక‌రిపించిన తీరు ప్ర‌శంస‌నీయం. మహిళల హాకీలో నెద‌ర్లాండ్స్ ఫ‌స్ట్ ర్యాంక్‌లో ఉంది.


ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో బోలెడ‌న్ని పెనాల్టీ కార్న‌ర్లు తీసుకున్న‌ది. గోల్ పోస్టుపై ఇండియా క‌న్నా ఎక్కువ దాడులు చేసినా సఫలం కాలేకపోయింది. మరోవైపు భారత మహిళలు గత ఒలింపిక్స్ ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నారు. చివర్లో ఆసీస్ క్రీడాకారిణులు గోల్ పోస్ట్‌ వద్ద ఒత్తిడి తీసుకొచ్చి టీమిండియాను అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఏ దశలోనూ టీమిండియా వెనక్కి తగ్గకుండా ఒత్తిడిని జయిస్తూ ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించి సరికొత్త చరిత్ర లిఖించారు.


Also Read: Tokyo Olympics Boxer Protest: రిఫరీపై కోపం... రింగ్ పై కూర్చొని బాక్సర్ నిరసన. టోక్సో ఒలింపిక్స్ లో షాకింగ్ సంఘటన