టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. దీంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన క్రీడాకారిణిగా తెలుగు తేజం పీవీ సింధు కొత్త రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో ఆసక్తికర పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించింది. దాంతో వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది.
బింగ్జియావోపై సింధుకు మంచి రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో మళ్లీ అదే ఆందోళన. ఈ మ్యాచ్ ముందు వరకు వీరిద్దరూ 15 సార్లు తలపడగా.. తొమ్మిదింట్లో ప్రత్యర్థి, ఆరింట్లో సింధు నెగ్గారు. కానీ, ఈ రోజు సింధు... ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థితో కూడా అనవసర తప్పిదాలు చేయిస్తూ సింధు తన ఖాతాలో పాయింట్లు జమ చేసుకుంది.
సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సింధు ఏడ్చింది
కాంస్య పతక పోరు అనంతరం పీవీ సింధు తండ్రి వేంకట రమణ స్పందించారు. ‘అందరికీ ధన్యవాదాలు. నిన్న సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సింధుతో మాట్లాడా. ఆమెలో స్ఫూర్తి నింపా. సింధు నాతో మాట్లాడే సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఏడవద్దు... తదుపరి మ్యాచ్ పై దృష్టి పెట్టమని చెప్పా. ఈ రోజు కోర్టులో చాలా దూకుడుగా కనిపించింది. స్ట్రోక్స్‌ని రిపీట్ చేయమని చెప్పా. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారిణిగా సింధు నిలిచింది’ అని రమణ అన్నారు.
సింధు కాంస్యం... స్వర్ణంతో సమానం
అనంతరం సింధు తల్లి విజయ మాట్లాడుతూ... ‘సింధు సాధించిన ఈ కాంస్యం... స్వర్ణంతో సమానం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సింధు 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో కూడా ఆడుతోంది. సింధు సంతోషమే మాకు ముఖ్యం’ అని తెలిపారు.
దేశం గర్విస్తోంది
సింధు కాంస్యం గెలవడంతో పలువురు ప్రముఖులు ‘దేశం గర్విస్తోంది’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు తదితరులు విషెస్ అందజేశారు.