కర్ణాటకలో రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని అయితే మార్చగలిగారు కానీ.. ఆయన టీంను ఏర్పాటు చేయడానికి మాత్రం తంటాలు బీజేపీ అగ్రనేతలు. మంత్రివర్గాన్ని ఖరారు చేసుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ముందు చాలా సమీకరణాలు ఉన్నాయి. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని కూలగొట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన వారికి గతంలో అందరికీ పదవులు దక్కలేదు. ఈ సారి తమకు దక్కాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ రాజకీయ సమీకరణాలన్నీ ఓ వైపు ఉంటే.. అసలు మరో కీలకమైన అంశం కూడా ఆ పార్టీ అగ్రనేతల్ని ఆలోచనకు గురి చేస్తోంది. అవే సీడీలు. అశ్లీల సీడీలు .
కొద్ది రోజుల క్రితం రమేష్ జార్కిహోళి అనే మంత్రి... ఓ యువతిని ఉద్యోగం పేరుతో లోబర్చుకున్న వ్యవహారం వీడియో సీడీలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వీడియోలను బయట పెట్టిన సామాజిక కార్యకర్త... తమ వద్ద ఇంకా పలువురు మంత్రుల సీడీలు ఉన్నాయని.. వరుసగా బయటపెడతానని ప్రకటించారు. దీంతో ఉలిక్కి పడిన ఆరుగురు మంత్రులు... వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై అభ్యంతరకమైన వార్తలు ప్రసారం చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు వీరి ఆందోళనను అర్థం చేసుకుని ఆ మేరకు ఆర్డర్ ఇచ్చింది. తమపై వార్తలొద్దని హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఆరుగురు మంత్రుల సీడీలు ఉన్నట్లుగా గట్టి నమ్మకం అందరికీ ఏర్పడింది.
కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి సర్కార్ ను కూలగొట్టేందుకు గతంలో ఆపరేషన్ కమల నిర్వహించారు. కాంగ్రెస్ , జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల క్యాంప్ ముంబైలో ఏర్పాటు చేశారు. అక్కడ వారికి కావాల్సిన విందులు.. పొందులు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. చాలా కాలం పాటు అక్కడ క్యాంప్ జరిగింది. ఆ సమయంలోనే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల జల్సాలను పకడ్బందీగా రికార్డు చేశారని.. తర్వాత తోక జాడించకుండా ప్లాన్ చేశారన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరి సీడీలు ఉన్నాయని ప్రచారం జరగడమే కాదు.. అలాంటి వారు... తమ గురించి ఎలాంటి సీడీలు ప్రసారం చేయవద్దని కోర్టును ఆశ్రయించడంతో.. ఇదంతా నిజమేనని అనుకునే పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు మంత్రులు.. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మంది సీడీల ఆరోపణల ఉన్నాయి. అదే సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని రమేష్ జార్కిహోళి మరోసారి బొమ్మైపై ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎటువంటి ఆరోపణలు లేనివారికే మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని.. చెబుతున్నారు. కానీ వారు బలమైన రాజకీయ నేతలు. ముందు జాగ్రత్తగా మార్ఫింగ్ వీడియోలు రాకుండా కోర్టుకు వెళ్తే.. తమపై నిందలు వేయడం కరెక్ట్ కాదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి వర్గ కూర్పు ఇప్పుడు.. బీజేపీలో హైటెన్షన్ పుట్టిస్తోంది.