ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఇటీవలే ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా నియమించింది. అయితే విచారణ పూర్తి కాకుండానే డిస్మిస్ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేయడం .. అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
తనపై సస్పెన్షన్ వేటు అక్రమం అని గతంలోనే సుప్రీంకోర్టులో ఏబీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో విచారణను కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ పూర్తి చేశారు. దానిపై సుప్రీంకోర్టులో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఇవన్నీ విచారణలో ఉండగానే.. ఏబీవీపై మేజర్ పెనాల్టీ అంటే డిస్మిస్ చేయాలని శనివారం అర్థరాత్రి కాన్ఫిడెన్షియల్ జీవోను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును, అభియోగ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాక... యూపీఎస్‌సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులను డిస్మిస్ చేయడం దాదాపు అసాధ్యమని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే నాన్ ఫర్ఫార్మెన్స్ అధికారులకు కేంద్రం స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపుతోంది. పంపితే ఈ కారణంతో పంపాలి కానీ డిస్మిస్ చేయడం అంత సులభం కాదంటున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ హయాంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా తర్వాత ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. అయితే ఆయనపై వైసీపీ నేతలు మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడే వైఎస్ఆర్ సీపీ నేతలు ఫిర్యాదులు చేయడంతో ఆయనను ఇంటలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయనను ఏసీబీ చీఫ్‌గా నియమించారు.
కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి... జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరి 8న సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు. హైకోర్టు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి విచారణలు పూర్తి కాకుండా ప్రభుత్వం డిస్మస్ సిఫార్సు చేసింది. ఏబీవీ వెంకటేశ్వరరావు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.