నామినేటెడ్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి శాసన మండలికి వెళ్లనున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. కౌశిక్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు.. టీఆర్ఎస్ కి లాభం అవుతుందనే లెక్కలో అధికార పార్టీ ఉంది. కిందటి ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి.. ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచారు. 61 వేల ఓట్ల వరకూ సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి కొన్ని రోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. చాలామంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న టైమ్ లోనే .. టీఆర్ఎస్ టికెట్ తనకేనని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో టెప్ బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దికాలానికే... కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి తీర్థం పుచ్చుకున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి చేరిన రోజుల సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేశారు. 1969 ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని నడిపారు. కానీ అప్పటి పాలకులు తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయారు. రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు నిరంతర ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రం చాలా కష్టపడి సాధించిన రాష్ట్రం. ఇది రాచరిక వ్యవస్థ కాదు..ఎప్పుడు ఒకరే అధికారంలో ఉండరు.' అని కేసీఆర్ అన్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ సందడి మెుదలైంది. అధిష్టానం పలువురికి హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం కారణంగా అన్ని స్థానాలు ఏకగ్రీవం అవుతాయి. నాగర్జున సాగర్ లీడర్ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని కేసీఆర్ స్వయంగా బహిరంగంగానే ప్రకటించారు. ఒకవేళ సుఖేందర్ రెడ్డని కొనసాగిస్తే.. సామాజిక సమీకరణల్లో కోటిరెడ్డికి అవకాశం ఇస్తారా... ఇవ్వరా అనేది వేచి చూడాలి.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారనేది తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగానే సాగింది.
విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక, పద్మశాలీలకు ఎమ్మెల్సీ ఇస్తామని గ్రేటర్ ఎన్నికల్లోనూ కేసీఆర్ హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఎమ్మెల్సీ ఖాయమని టీఆర్ఎస్ శ్రేణుల అంచనా. అదే నిజమైతే... ఒకే జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు మరేదైనా పదవి దక్కే ఛాన్స్ ఉంది.
Also Read: KCR Runa Mafi : ఈ నెలలోనే రూ.50వేల రుణమాఫీ..! రైతులకు కేసీఆర్ వరం..!