ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది.  ఐరాల మండలం రంగయ్య చెరువు ఎస్టీ కాలనీకి చెందిన ఓ మహిళ.. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.  ఈ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని అనుకుంది. అల్లుడితో కలిసి భర్తను చంపేసింది. సీఐ మధసూదన్ రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం రంగయ్య చెరువు ఎస్టీ కాలనీలో నాగరాజు(50),మంజుల(40) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యంతో కూతురి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత మంజులు కూతురి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో అల్లుడు సుబ్రహ్మణ్యంతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.


మూడేళ్లుగా అల్లుడు, అత్త అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కుమార్తె రాణి ఇంటికి మంజుల వచ్చింది. ఆమె కోసం భర్త నాగరాజు గత ఆదివారం ఇర్లపల్లెకు వచ్చాడు. అక్కడే అత్త, అల్లుడికి నాగరాజును చంపేయాలనే ఆలోచన పుట్టింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటున్నాడని ఇద్దరూ అనుకున్నారు. ఎలాగైనా తప్పించాలనుకున్నారు. అత్త, అల్లుడు కలిసి ప్లాన్ వేశారు 


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను హత్య చేసేందుకు అల్లుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం... అల్లుడితో కలిసి భర్త నాగరాజును మంజుల కంచెంవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి అతనికి పీకలదాకా మద్యం తాగించారు. అనంతరం కర్రలు,రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆపై సమీపంలోని ఓ కుంటలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేశారు.


కుంటలో మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు క్రమంలో మృతుడు నాగరాజు భార్య మంజులపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.


పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మంజుల నేరం అంగీకరించింది. అల్లుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందువల్లే హత్యకు పాల్పడినట్లు వెల్లడించింది. దీంతో మంజులతో పాటు ఆమె అల్లుడు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ రిమాండుకు తరలించారు.


 


Also Read: Mogalikudugu: తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబం అదృశ్యం... సూసైడ్ నోట్ హల్ చల్... గోదావరి వంతెనపై పిల్లల దుస్తులు