ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.  ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగ ఖాళీల విషయంలో నిరుద్యోగులు.. విద్యార్థి సంఘాలు ఆందోళన తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నాలుగు, ఐదు తేదీల్లో నిరాహారదీక్షలకు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వారిని సంతృప్తి పరచడానికి జాబ్ క్యాలెండర్‌ను సవరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆరో తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై చర్చించి..  కొత్త ఉద్యోగాలను జోడించడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.  


వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పుకునే మేనిఫెస్టోలో ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కారణం ఏమిటో కానీ .. రెండు జనవరి ఒకటిలు దాటిపోయినా... సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారు. చివరికి  నెలన్నర క్రితం జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అందులో పదివేలకు కొద్దిగా ఎక్కువ మాత్రమే ఉద్యోగాలున్నాయి. జగన్ ఎన్నికల ప్రచారంలో రెండున్నర లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని.. తాను రాగానే అన్నీ భర్తీ చేస్తానని  ప్రకటించారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే రెండేళ్లు ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాలు మరీ దారుణంగా పదివేల వరకూ ఉండటంతో నిరుద్యోగులు నిరాశపడ్డారు. 


గ్రూప్స్ ఉద్యోగాలు 36 మాత్రమే ఉండటం... యువత ఎక్కువ మంది ఆశలు పెట్టుకునే పోలీసు ఉద్యోగాలు నాలుగు వందలే ఉండటం నిరుద్యోగులు అసంతృప్తి చెందుతున్నారు.  వరుసగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు కూడా వారికి అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు కూడా నిరసనలకు పిలుపునిస్తున్నాయి. భారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్లినా అడ్డుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం పునరాలోచన చేయక తప్పడం లేదు. 


జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేసిన ప్రభుత్వం..  ఇటీవల ఏపీపీఎస్సీ ద్వారా ఓ ప్రకటన చేయించింది. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ ప్రకటన సారాంశం.  2018లో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్ధులు లభించక 364 పోస్టులు భర్తీ కాలేదు. ఇప్పుడు అన్ని వివరాలతో..మరిన్ని పోస్టులు కలుపుకుని 12 వందలకు పైగానే ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెబుతోంది. అయితే కేబినెట్ అయినా అరకొరగానే కొత్త ఉద్యోగాల భర్తీ చేస్తుంది కానీ..జగన్ చెప్పినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.