తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన 4గురు కుటుంబసభ్యుల అదృశ్యం మిస్టరీగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన భర్త (32), భార్య (22), కుమారుడు (4), కుమార్తె (2) కనిపించడంలేదు. వారికి చెందిన వాహనంగా భావిస్తున్న మోటార్‌ సైకిల్‌తో పాటు, పిల్లల దుస్తులు జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వంతెనపై పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురూ బతికే ఉన్నారా! లేక వశిష్ట నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా! అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.




ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమ చావుకు కొంతమంది వ్యక్తులు కారణమని పేర్కొంటూ భార్య రాసిన లేఖ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యింది. దీంతోపాటు ‘డాడీగారండీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నలుగురం ఇప్పుడే చనిపోతున్నాం. నేను స్పాట్‌లో ఉన్నాను. ఆ లేఖ రాసింది నేనే. జీవితం తగలబెట్టేశాడు. అది నేను ఇప్పుడే తెలుసుకున్నాను’ అంటూ ఆ వివాహిత ఆడియో సందేశం కూడా వాట్సప్‌ గ్రూపుల్లో హల్ చల్ చేస్తుంది. తనను రోజూ ఓ వ్యక్తి టార్చర్‌ పెట్టేవాడని, తనకు తెలియకుండానే మాత్రలు ఇచ్చేవాడని, తన డబ్బులు, బంగారం దోచుకున్నాడని ఆమె లేఖలో రాసింది. అది విని తన భర్త తట్టుకోలేకపోయాడని, తన కాపురం నాశనమైందని, ఇదంతా డబ్బు, బంగారం కోసమే ఆ వ్యక్తి చేశాడని రాసింది. ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉంటున్న ఆమె భర్త కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం సొంతూరికి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు.  


మొగలికుదురు గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ, ఆడియో కలకలం సృష్టిస్టున్నాయి. యలమంచిలి మండలం చించినాడ వంతెనపై వారి ద్విచక్రవాహనం, చిన్నారుల దుస్తులు వదిలేశారు. వాహనం, దుస్తులు.. శనివారం ఉదయం గోదావరి వారధిపై కనిపించడంతో వశిష్ఠ నదిలో దూకి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్విచక్ర వాహనం, దుస్తువులను యలమంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కుటుంబ కలహాలే ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి కారణమన్నట్లు తెలుస్తోంది. మా కుటుంభికులే మమ్మల్ని మోసం చేశారని... దీంతో తన భర్త పిల్లలతో చనిపోతున్నట్లు ఓ లేఖ, ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 


Also Read: Kandahar Airport Racket Attack: కాందహార్ ఎయిర్ ఫోర్ట్‌పై రాకెట్లతో దాడి... నిలిచిపోయిన విమానసేవలు...తాలిబన్ల దుశ్చర్యగా ధ్రువీకరించిన అధికారులు