అందంతో వల విసిరి యువకుల వద్ద డబ్బులు లాగేసి తర్వాత మొహం చాటేసిన యువతుల కేసులు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఓ యువకుడు తన అందాన్ని ఎరగా వేసి సోషల్ మీడియా ద్వారా యువతులను ముగ్గులోకి దింపి మోసం చేశాడు. వారితో సన్నిహితంగా చాటింగ్ చేసి నగ్న, అర్ధనగ్న చిత్రాలు పంపమని అడిగి, చివరికి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. అంతేకాక, ఉద్యోగాల పేరుతో అమాయకుడిని నమ్మించి నట్టేట ముంచాడు. ఈ కిలాడీ యువకుడిని కడప జిల్లా పోలీసులు పట్టుకోగా.. అతను గతంలో చేసిన మోసాలను పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు. ఈ నిందితుడికి సంబంధించిన వివరాలను కడప జిల్లా డీఎస్పీ సునీల్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.


కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అనే వ్యక్తి అనేక పేర్లతో చెలామణి అయ్యాడు. ప్రసన్న కుమార్ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీగా చెలామణి అయిన ఈ వ్యక్తి ఇంజినీరింగ్‌ మధ్యలోనే ఆపేసి విలాసాలకు జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017 నుంచే చోరీలు చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే బంగారు చైన్‌ల దొంగతనాలు, తాళం వేసి ఉన్న ఇంట్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డాడు. అప్పుడే పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి బెయిలుపై బయటికి వచ్చాడు. అంతటితో ఆగకుండా తన నేరాలను కొనసాగించాడు. 


ఇతడికి షేర్‌చాట్‌ సోషల్ మీడియా యాప్ ద్వారా శ్రీనివాస్‌ అనే వ్యక్తితో 2020లో పరిచయమైంది. తన పేరు ప్రశాంత్‌రెడ్డి అని, హైదరాబాద్‌ తెలంగాణ సెక్రెటేరియట్‌లో పనిచేస్తున్నానని, అందులో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌తో నమ్మబలికాడు. అందుకోసం డబ్బులు డిమాండ్ చేశాడు. తన తల్లి కోసం వైద్యం చేయించేందుకు డబ్బు అవసరం ఉందని, అందుకే అడుగుతున్నానని చెప్పాడు. దీంతో ఉద్యోగం కోసం శ్రీనివాస్‌ తన తల్లి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లి ఇచ్చాడు. తర్వాత శ్రీనివాస్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నిందితుడు స్పందించలేదు. జులై 29న మరో చోరీ కేసులో ప్రసన్న కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 


హైదరాబాద్‌ సహా కడప, విజయవాడ తదితర నగరాల్లో ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, మధ్య వయసు ఉండే మహిళలతో పరిచయం పెంచుకుని వారికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. వారితో చాటింగ్‌ చేస్తూ వారి నగ్న, అర్ధనగ్న చిత్రాలను, వీడియోలను ఇవ్వమని అడిగేవాడు. అవి తన చేతికి వచ్చాక వాటితో బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు పంపాలని వేధించేవాడు. లేదంటే నగ్న చిత్రాలను సోషల్ మీడియా యాప్‌లలో పెడతానని బెదిరించేవాడు. ఇలా దాదాపు సుమారు 200 మంది వరకూ యువతులు, వంద మంది మహిళలను మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతని ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. అన్నీ యువతులు, మహిళల ఫోటోలే ఉన్నాయని డీఎస్పీ సునీల్ తెలిపారు.


నిందితుడి అరెస్టు చేసి అతని నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై ఏపీ సహా తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.