పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్‌ కోహ్లీ సారథ్యంపై ఆరు నెలలుగా తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్ అంటున్నాడు. బహుశా మార్పుపై సెలక్టర్లు, బీసీసీఐ పాలకుల నుంచి అతడికి సూచనలు అందే ఉంటాయని పేర్కొన్నాడు. భవిష్యత్తు సారథిగా కేఎల్‌ రాహుల్‌ను తయారు చేసేందుకు అతడికి వైస్‌ కెప్టెన్సీ ఇవ్వాలని సూచించాడు.


'విరాట్‌ కోహ్లీ లేఖ చదివాను. రవిశాస్త్రి, రోహిత్‌, గంగూలీ, సెలక్టర్లతో అతడు కూలంకషంగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి సారథ్యంపై ఆరు నెలలుగా తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. బహుశా అతడి సారథ్యంపై బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీ సంతృప్తిగా లేవని అతడికి సూచనలు అంది ఉండొచ్చు.  అతడు పొట్టి క్రికెట్‌ నాయకత్వ బాధ్యతలను వదిలేయడానికి, మరొకరికి పగ్గాలు అప్పగించడానికి ఇదే కారణం కావొచ్చు' అని సన్నీ అన్నాడు.


'టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్సీ చేస్తానని కోహ్లీ ప్రస్తావించాడు. అయితే అతడి వన్డే సారథ్యంపై నిర్ణయం తీసుకొనేది సెలక్టర్లే.  టెస్టు నాయకత్వంపై మాత్రం ప్రశ్నల్లేవు. వన్డేల్లో సారథ్య మార్పులుంటాయా లేదా చూడాలి' అని గావస్కర్‌ అన్నాడు.  బీసీసీఐ భారత క్రికెట్‌ భవిష్యత్తు గురించి ఆలోచిస్తోందని సన్నీ పేర్కొన్నాడు. అలా చేయడం మంచిదేనని వెల్లడించాడు. మున్ముందు నాయకత్వ బదిలీ సాఫీగా సాగేందుకు కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌ చేయాలని ఈ క్రికెట్‌ దిగ్గజం సూచిస్తున్నాడు.


'ఒకవేళ భారత్‌ భవిష్యత్తు సారథి తయారు చేయాలనుకుంటే కేఎల్‌ రాహుల్‌ వైపు చూడటం మంచిది. అతడు బాగా రాణిస్తున్నాడు.  ఇంగ్లాండ్‌లోనూ అతడి బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. ఐపీఎల్‌లోనూ అతడు భీకరంగా ఆడుతున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో దుమ్మురేపుతున్నాడు. అందుకే అతడిని వైస్‌ కెప్టెన్‌ చేస్తే చేయాలి. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను అతడు మెరుగ్గా నడిపిస్తున్నాడు' అని సన్నీ తెలిపాడు.


Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్‌ రూమ్‌లో భగ్గుమన్న విభేదాలు.. రోహిత్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న కోహ్లీ!


Also Read: Kohli Leaves T20 Captaincy: కోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?


Also Read: Kohli T20 Record: టీ20 కెప్టెన్‌గా కొహ్లీ సూపర్‌ హిట్‌.. రికార్డుల్లో సరిలేరు విరాట్‌కెవ్వరు