తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021-22 విద్యా సంవత్సరంలో బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) కింద 30 శాతం సీట్లను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్ల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలి. సంబంధిత కాలేజీల యాజమాన్యాలు టైమ్ టేబుల్ వివరాలను.. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలలో మూడు ప్రధాన పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కాలేజీలకు నేరుగా వెళ్లడం ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌ విధానంలో కానీ దరఖాస్తులను సమర్పించవచ్చు. కాలేజీల యాజమాన్యాలు రోజు వారీ దరఖాస్తుల వివరాలతో రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. 


ఎన్‌ఆర్‌ఐ కోటా.. జేఈఈ మెయిన్‌
మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేయనున్న 30 శాతం సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద.. మిగతా సగం జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా కేటాయించాల్సి ఉంటుంది. ఇంకా సీట్లు మిగిలితే వాటిని ఎంసెట్‌ ర్యాంకు, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకోవచ్చు. ఎంసెట్‌ ర్యాంకులు లేదా జేఈఈ మెయిన్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేసే 15 శాతం సీట్లకు కన్వీనర్‌ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. స్పాన్సర్డ్‌ లేదా ఎన్‌ఆర్‌ఐ కోటాకు మాత్రం సంవత్సరానికి 5 వేల అమెరికా డాలర్లు ఫీజుగా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి.. మెరిట్‌ జాబితాను ఆయా కాలేజీల వెబ్‌ పోర్టల్‌, నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. 


భారీగా పెరిగిన ప్రభుత్వ బీటెక్‌ ఫీజులు.. 
తెలంగాణలో ప్రభుత్వ బీటెక్‌ ఫీజులు భారీగా పెరిగాయి. రెగ్యులర్ కోర్సులతో పాటు సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల ఫీజులను సైతం రెండు రెట్లు అధికం చేశాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడం విద్యార్థులకు భారంగా మారనుంది.  కొత్తగా పెరిగిన ఫీజులు.. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌తో పాటు సుల్తానాపూర్‌, జగిత్యాల, మంథని, ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న సిరిసిల్ల కాలేజీల్లోనూ అమలు కానున్నాయి. ఈ పెంపు ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీకి కూడా వర్తిస్తుంది. ఎలాంటి అధికారిక ప్రకటనా లేకుండానే విశ్వవిద్యాలయాలు ఫీజులను పెంచాయి. 


Also Read: Engineering Pharma Seats: తెలంగాణలో అందుబాటులోకి 94 వేల ఇంజనీరింగ్ సీట్లు... ఉన్నత విద్యా మండలి ప్రకటన... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు


Also Read: SDLCE (KU): ఇంటి వద్ద ఉండి చదవాలనుకుంటున్నారా.. కాకతీయ యూనివర్సిటీ మీకో గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది.. అదేంటో తెలుసా?