తెలంగాణ ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లో సీట్లు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీచేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 161 కళాశాలల్లో 85,149 సీట్లకు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 146 ప్రైవేట్ కాలేజీల్లో 81,504 సీట్లు, 15 యూనివర్సిటీల్లో 3,645 ఇంజినీరింగ్ సీట్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్ కోటా కింద 60,697 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ కాలేజీలు యాజమాన్య కోటాలో మిగతా సీట్లు భర్తీ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న 130 ప్రైవేట్ కాలేజీల్లో 72,149 సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చారు. ఓయూ పరిధిలో 13 కళాశాలల్లో 8,990 సీట్లకు, కాకతీయ యూనివర్సిటీ 3 కళాశాలల్లో 1,365 సీట్లకు అనుమతి లభించింది.
ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి
శనివారం జేఎన్టీయూహెచ్ పరిధిలోని మరో 6 కాలేజీల్లో మరో రెండున్నర వేల సీట్లు అందుబాటులోకి వస్తాయిని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వచ్చిన కారణంగా కన్వీనర్ కోటాలో సుమారు మరో ఆరున్నర వేల సూపర్ న్యుమరరీ సీట్లు ఆ కోటాలో మంజూరయ్యాయి. ఇవన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 94 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ డబ్ల్యూఎస్ సీట్లతో కలిపి దాదాపు 69 వేల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవ్వనున్నాయి.
బీ ఫార్మసీ సీట్లకు గుర్తింపు
జేఎన్టీయూహెచ్ 51 ప్రైవేట్ కాలేజీల్లో 4,300 బీ-ఫార్మసీ సీట్లకు అనుబంధ గుర్తింపు వచ్చింది. ఓయూ 15 కళాశాలల్లో 1,420 సీట్లకు, కాకతీయ యూనివర్సిటీ 22 కళాశాలల్లో 1,740 సీట్లకు అనుబంధ గుర్తించి లభించింది. రాష్ట్రంలో 91 కాలేజీల్లో 7,640 బీ-ఫార్మసీ, 44 కాలేజీల్లో 1,295 ఫార్మ్-డీ సీట్లకు విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. 88 ప్రైవేట్ కాలేజీల్లో 7,460 సీట్లు, 3 యూనివర్సిటీ కళాశాలల్లో 180 బీ-ఫార్మసీ సీట్లకు ఈ ఏడాది అనుమతి వచ్చింది. కన్వీనర్ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 2,611, బైపీసీ అభ్యర్థులకు మరో 2,611 సీట్లు భర్తీ కానున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 520 సూపర్ న్యుమరరీ సీట్లకు అనుమతి లభించింది.
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
రాష్ట్రంలో 44 కళాశాలల్లో 1,295 ఫార్మ్-డి సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చాయి. కన్వీనర్ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 454, బైపీసీ అభ్యర్థులకు మరో 454 ఫార్మ్-డి సీట్లు అందుబాటులో ఉంటాయి. శనివారం నుంచి ఈ నెల 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటితో ముగుస్తోంది. శుక్రవారం వరకు 59,901 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
Also Read: Aadhar Number: ఆధార్ నంబర్ మార్చడం కుదరదు.. ఉడాయ్ కీలక ప్రకటన