విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియా టీ20 సారథ్యం వదులుకొనే ముందు పెను దుమారమే చెలరేగింది! డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్టు తెలిసింది. వయసు కారణాలతో రోహిత్‌ శర్మను వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించాలని బీసీసీఐని కోహ్లీ కోరాడని వార్తలు వస్తున్నాయి. అందుకు ససేమిరా అన్న గంగూలీ, జే షా నేతృత్వంలోని బోర్డు విరాట్‌కే పంచ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.


పైపై మాటలేనా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి క్రికెట్‌ సారథ్యం నుంచి తప్పుకుంటానని విరాట్‌ కోహ్లీ గురువారం సాయంత్రం ప్రకటించాడు. కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహిస్తున్నానని వెల్లడించాడు. పనిభారం, ఒత్తిడి దృష్ట్యా బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. బీసీసీఐ అధ్యక్షకార్యదర్శులు గంగూలీ, జే షా, కోచ్‌ రవిశాస్త్రి, నాయకత్వ బృంద సభ్యుడు రోహిత్‌తో ఎన్నో సార్లు చర్చలు జరిపానన్నాడు. కానీ ఇవన్నీ పైపై మాటలేనని కొందరు అంటున్నారు.


Also Read: కోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?


ఇష్టం లేదా?
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు రోహిత్‌ శర్మ దూసుకుపోతున్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. అటు పరిమిత ఓవర్ల క్రికెట్లో శతకాల మోత మోగిస్తున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టెస్టు జట్టులోనూ సుస్థిర స్థానం సంపాదించాడు.. టెక్నిక్‌ను మార్చుకొని, సమయోచితంగా ఆడుతూ, శతకాలు చేస్తూ జట్టు విజయానికి తోడ్పడుతున్నాడు. అలాంటి రోహిత్‌ను వన్డే క్రికెట్‌ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని విరాట్‌ కోహ్లీ బీసీసీఐకి సూచించాడట. కారణంగా అతడి వయసు (34)ను చూపించాడట. భవిష్యత్తు దృష్ట్యా యువకులైన  కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ పేర్లు సూచించాడట. దాంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో పెను దుమారమే రేగినట్టు తెలిసింది.


పంచ్‌ ఇచ్చిన బోర్డు!
విరాట్‌ ప్రతిపాదన బోర్డు వర్గాలకు మిగుడుపడలేదని సమాచారం. గంగూలీ నేతృత్వంలోని బోర్డు రోహిత్‌, కోహ్లీని ఒకే స్థాయిలో చూస్తోంది. ఇద్దరికీ ఒకేరకమైన ప్రాధాన్యం ఇస్తోంది. విరాట్‌ ప్రతిపాదన వినగానే అతడు నిజంగా తన వారసుడిని కోరుకోవడం లేదని భావించిందట. ఇవన్నీ గమనించిన అతడు టీ20 సారథ్యం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.


Also Read: టీ20 కెప్టెన్‌గా కొహ్లీ సూపర్‌ హిట్‌.. రికార్డుల్లో సరిలేరు విరాట్‌కెవ్వరు


విరాట్‌కు తెలుసు
'యూఏఈలో జరిగే ప్రపంచకప్‌లో జట్టు రాణించకపోతే తెలుపు బంతి కెప్టెన్‌గా తనను తొలగిస్తారని విరాట్‌కు తెలుసు' అని బీసీసీఐ ఇన్‌సైడర్‌ ఒకరు పీటీఐకి చెప్పారు. 'విషయం తెలుసు  కాబట్టే విరాట్‌ తనపై ఉన్న ఒత్తిడిని తొలగించుకున్నాడు. పొట్టి క్రికెట్లో జట్టు ప్రదర్శన బాగాలేకపోయినంత మాత్రాన వన్డేల్లోనూ తొలగిస్తారని చెప్పలేం. బీసీసీఐ నిర్ణయిస్తే మాత్రం కోహ్లీ టెస్టులకు మాత్రమే పరిమితం అవుతాడు' అని ఆ ఇన్‌సైడర్‌ అంటున్నారు.


రోహిత్‌లో ఎంఎస్‌ లక్షణాలు
ఆటగాళ్ల యోగక్షేమాలు, ఇబ్బందులను కోహ్లీ పట్టించుకోడని ఆ ఇన్‌సైడర్‌ తెలిపారు. 'నిజానికి ఎంఎస్‌ ధోనీ గది తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఆటగాళ్లు ఎప్పుడైనా అతడి వద్దకు వెళ్లొచ్చు. వీడియోగేములు ఆడొచ్చు. కలిసి భోజనం చేయొచ్చు. కానీ మైదాన బయట క్రికెట్ గురించి మాట్లాడేందుకు కోహ్లీ ఆటగాళ్లకు అసలు అందుబాటులోనే ఉండడు. రోహిత్‌ మాత్రం ఇందుకు భిన్నం. అతడిలో ఎంఎస్ లక్షణాలు కనిపిస్తాయి. జూనియర్లతో కలిసి భోజనాలకు వెళ్తాడు. ఇబ్బంది పడుతున్నప్పుడు వెన్నుతడతాడు. వారి మానసిక ఇబ్బందులను తొలగిస్తాడు' అని ఇన్‌సైడర్‌ అన్నారు.


Also Read: షాక్‌.. షాక్‌.. షాక్‌! టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్‌ కోహ్లీ