షాక్.. షాక్.. షాక్! టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అందరికీ ఒక్కసారిగా షాకిచ్చాడు! తన సంచలన నిర్ణయంతో అందరినీ విస్మయపరిచాడు. పనిభారంతో టీ20 క్రికెట్ పగ్గాలు వదిలేస్తున్నానని అధికారికంగా ప్రకటించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత నాయకత్వం మరొకరికి అప్పగిస్తానని తెలిపాడు. ఇప్పటికే ఈ విషయాన్ని కోచ్ రవిశాస్త్రి, సహచరుడు రోహిత్ శర్మతో మాట్లాడానని వెల్లడించాడు. ఈ మేరకు అతడు సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశం పోస్టు చేశాడు.
'టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం వహించినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నా శక్తిమేరకు సారథ్యం వహించాను. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నా ప్రయాణంలో సాయం చేసిన అందరికీ ధన్యవాదాలు. కుర్రాళ్లు, సహాయ బృందం, సెలక్షన్ కమిటీ, నా కోచులు, భారత క్రికెట్లోని ప్రతి ఒక్కరికీ కృజత్ఞతలు.
పనిభారాన్ని అర్థం చేసుకోవడం అత్యంత కీలకం. ఎనిమిది తొమ్మిదేళ్లుగా నేను మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాను. ఐదారేళ్లుగా నాయకత్వం వహిస్తున్నాను. ఇదెంతో శ్రమతో కూడిన పని. టీమ్‌ఇండియాను సుదీర్ఘ ఫార్మాట్, వన్డే క్రికెట్లో సామర్థ్యం మేరకు నడిపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. టీ20 కెప్టెన్‌గా ఎంతో పనిచేశాను. ఇకపై టీ20 బ్యాట్స్‌మన్‌గా జట్టులో కొనసాగుతాను.
నిజమే, ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయమే పట్టింది. నా సన్నిహితులు, రవి భాయ్, రోహిత్‌తో అనేక సార్లు చర్చించాను. వారిద్దరూ భారత క్రికెట్ నాయకత్వ బృందంలో కీలక సభ్యులు. అక్టోబర్లో దుబాయ్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. నేనిప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాతో మాట్లాడాను. నా శక్తిమేరకు భారత క్రికెట్‌కు సేవలందిస్తాను' అని విరాట్ కోహ్లీ సుదీర్ఘంగా పోస్టు చేశాడు.
Also Read: IPL 2021: 'అతనో బ్యాటింగ్ రాక్షసుడు!'.. బుమ్రా బౌలింగ్‌ను చితకబాదేస్తాడన్న గంభీర్
కోహ్లీ పొట్టి క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. అభిమానులు, మాజీ క్రికెటర్లు కొందరు అతడి నిర్ణయాన్ని హర్షిస్తుండగా మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.