ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల లెక్కల చిక్కులు తప్పడం లేదు. కార్పొరేషన్ల పేరుతో చేసిన రుణాల లెక్కలను చెప్పాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. బడ్జెట్‌లో చూపకుండా చేసిన అప్పుల వివరాలను పూర్తిగా తెలియచేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా తీసుకున్న రుణాలను మాత్రమే ఇప్పటి వరకూ అప్పులుగా చెబుతోంది. అయితే వివిధ కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. వీటిని ప్రభుత్వమే ఉపయోగించుకుంది. తిరిగి చెల్లింపులు కూడా ప్రభుత్వమే చేస్తోంది. ఈ క్రమంలో అనేక ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కార్యాలయం పూర్తి వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది.


కార్పొరేషన్ అప్పులు బడ్జెట్‌లో చూపించకపోవడంతో కాగ్ లేఖ
బడ్జెట్‌లో చూపించకుండా చేసిన అప్పులు ఎంత ? ఏ ఏ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకున్నారు ? ఏ బ్యాంక్, ఆర్థిక సంస్థ వద్ద ఎంతెంత తీసుకున్నారు ? రుణాల కోసం వారికి ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి ?రుణాలను ఎలా తిరిగి చెల్లిస్తున్నారు ? అనే అంశాలపై సమగ్రమైన వివరాలు పంపాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ఏపీ ఆర్థిక శాఖ అధికారులకు లేఖ అందినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలను సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే సమాధానం పంపేందుకు సిద్ధమవుతున్నారు. Also Read : సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ... బహ్రెయిన్ లో తెలుగు వారి సమస్య పరిష్కారం...


కార్పొరేషన్ల రుణాలకు వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం 
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆదాయ, వ్యయ వివరాలను కాగ్‌కు పంపించాలి. వారు పరిశీలించి సందేహాలు ఉంటే నివృతి చేసుకుని ఫైనల్ చేస్తారు. ఈ లెక్కల్లో ఏపీ ప్రభుత్వం చాలా రోజుల నుంచి బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్నరుణాల గురించే ప్రస్తావిస్తోంది. అంటే కేంద్రం అనుమతించిన రుణాల పరిమితి మేరకు రిజర్వ్ బ్యాంక్ వద్ద బాండ్లను వేలం వేసి తెచ్చుకుంటున్నరుణాలను మాత్రమే చూపిస్తున్నారు. కానీ కార్పొరేషన్ల కింద సేకరిస్తున్న రుణాల లెక్కలను చూపించడం లేదు. అయితే చెల్లింపుల దగ్గరకు వచ్చే సరికి ఆయా కార్పొరేషన్లు కాకుండా ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతో లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే కార్పొరేషన్ల రుణాల గురించి కాగ్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. Also Read : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?


కార్పొరేషన్ల పేరుతో రూ. లక్ష కోట్లు అప్పు చేసినట్లుగా ప్రచారం 
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో వివిధ కార్పొరేషన్లను ప్రారంభించి వాటి పేరుతో దాదాపుగా రూ. లక్ష కోట్లను అప్పు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్క రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారానే రూ. పాతిక వేల కోట్ల అప్పు తీసుకున్నారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. వాటికి మద్యం ఆదాయాన్ని ఎస్క్రో చేసి తనఖా పెట్టారని కూడా ఆరోపణలు చేశారు. ఆ తరహాలోనే పలు కార్పొరే్షన్ల ద్వారా రుణాలు తీసుకున్నారని అంచనా వేస్తున్నారు. అయితే లెక్కలు మాత్రం ప్రభుత్వం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు కాగ్ వివరాలు అడగడంతో కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పుల వివరాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Also Read : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..?