రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు  ప్రాణం తీసుకున్నాడు.


స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్డడం సహా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు.. విస్తృతంగా ప్రచారం జరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఈనెల 9న సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగినప్పటి నుంచీ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిట్టితల్లిని లైంగికంగా హింసించి చంపేసిన ఆ మృగాన్ని వెంటాడి, వేటాడి చంపాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ అంతా ఆవేశంతో ఊగిపోయారు. తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని తలుచుకుని తల్లడిల్లిపోయారు. సజ్జనార్ సార్ మీరు మళ్లీ రావాలని రిక్వెస్టులు పెట్టారు.  ఇలాంటి సమయంలో ఆ మృగం చచ్చిందన్న వార్త కొంత ఊరట నిస్తోందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.



నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌  ట్విటర్​ ద్వారా వెల్లడించారు.



సైదాబాద్ ఘటన నిందితుడి మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి ట్విటర్​ వేదికగా తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహం గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతదేహంపై ఆనవాళ్ల ఆధారంగా రాజుగా గుర్తించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్ చెప్పారు.



రాజు ఆత్మహత్యపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారి పై హత్యాచారానికి పాలుపడిన కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరటను కలిగిస్తుంది. ఈ ఘటన పై మీడియా పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా.. వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి.. అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు మంచు మనోజ్, క్రికెటర్ హనుమ విహారి వంటి సెలెబ్రిటీలు సైతం ఈ ఘటనపై స్పందించారు. మరొకరు ఇలాంటి అమానుష ఘాతుకాలకు పాల్పడకుండా ఉండేలా నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు.






 సైదారాబాద్‌ అత్యాచార నిందితుడు రాజు... ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గాలింపు ముమ్మరం కావడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటాడనని పోలీసులు అనుమానించారు. ఈ తరుణంలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ స్టేషన్‌ రైల్వేట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైంది. స్టేషన్‌ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద.. అతను సంచరించినట్లు రైల్వే కార్మికులు తెలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు చెప్పారు. రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన కార్మికులు... డయల్‌ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు . రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని వరంగల్ సీపీ తరుణ్​ జోషి పరిశీలించారు. ఉదయం 8:45 గం.కు మృతదేహాన్ని గుర్తించి రైల్వే కార్మికులు సమాచారం ఇచ్చారన్నారు. రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్న తరుణ్ జోషి అసలు నిందితుడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తామన్నారు.