సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తామని మంత్రులు చెప్పారు. మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. 




చెక్కు వెనక్కి ఇచ్చేస్తాం


ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని గురువారం ఉదయం మంత్రులు పరామర్శించారు. మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ వారికి రూ.20 లక్షల చెక్కు అందించారు. మంత్రులు చేసిన సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 


షర్మిల దీక్ష భగ్నం


సైదాబాద్‌ చిన్నారి అత్యాచార, హత్యకు నిరసనగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైస్ ష‌ర్మిల బుధవారం దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించేంత వ‌ర‌కు తాను అక్కడి నుంచి క‌దిలేది లేద‌ని తేల్చిచెప్పారు. దీంతో బుధవారం అర్ధరాత్రి పోలీసులు వైఎస్ ష‌ర్మిల దీక్షను భ‌గ్నం చేశారు. ష‌ర్మిల‌ను దీక్షాశిబిరం నుంచి లోట‌స్‌పాండ్‌కు త‌ర‌లించారు.  బుధ‌వారం మ‌ధ్యాహ్నం బాధిత బాలిక కుటుంబాన్ని వైఎస్ ష‌ర్మిల పరామర్శించారు. వారికి అండ‌గా ఉంటామని హామీఇచ్చారు.  నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.





 


రూ.పది కోట్లు ఇవ్వాలని డిమాండ్


హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని దీక్షలో చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధితులు ఎస్టీలు కావడం వల్లే స్పందించడం లేదని మండిపడ్డారు. తక్షణం ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలని, ఆ చిన్నారి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. పది కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తాను దీక్షను విరమించబోనని ప్రకటించారు. తెలంగాణను మద్యం, డ్రగ్స్ అడ్డాగా మార్చారని ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని ఆమె ఆరోపించారు. 


Also Read: నేడు తెలంగాణ కేబినేట్ భేటీ... సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం... దళిత బంధు, ఉద్యోగాల భర్తీ, వరిసాగుపై కీలక చర్చ