పోటీ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చితకబాదే ఒకేఒక్కడు ఏబీ డివిలియర్స్ మాత్రమేనని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉండటం విరాట్ కోహ్లీ అదృష్టమని పేర్కొన్నాడు. ఆర్‌సీబీకి మాక్స్‌వెల్ రూపంలోనూ మరో మంచి బ్యాట్స్‌మన్ దొరికాడని వెల్లడించాడు. ఐపీఎల్ రెండో దశలో ఆర్‌సీబీ పరిస్థితిపై గౌతీ మాట్లాడాడు.
'ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు విరాట్ కోహ్లీకి దొరికారు. వారుండటం ఆర్‌సీబీ అదృష్టమనే చెప్పాలి. ఒకవేళ మాక్సీ విఫలమైనా ఏబీ దంచికొడతాడు. టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంలో ఏబీకి మాత్రమే అనుభవం ఉంది. అతడిలా బుమ్రా బౌలింగ్‌ను నిలకడగా దంచికొట్టే మరో బ్యాట్స్‌మన్‌ను నేనిప్పటి వరకు చూడలేదు. ఏబీ ఓ బ్యాటింగ్ రాక్షసుడు!' అని గౌతీ అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించాలన్న ఒత్తిడి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై ఉందని గంభీర్ అంటున్నాడు. 'అవును, వారిపై ఒత్తిడి ఉంటుంది. విరాట్ ప్రమాణాల ప్రకారం ఆర్‌సీబీ మైదానలోకి దిగి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించాలి. ప్రత్యేకించి ఐపీఎల్‌లో! ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఐదారుగురు అత్యుత్తమ అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. ఐపీఎల్‌లో అలా ఉండరు' అని అతడు తెలిపాడు.
'ఐపీఎల్ జట్టులో ఇద్దరు ముగ్గురు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. మిగతావాళ్లు దేశవాళీ బౌలర్లే. వారిపై బ్యాటర్లు ఆధిపత్యం చలాయించొచ్చు. అందుకే ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీపై అత్యధిక ఒత్తిడి ఉంటుంది. ఏటా భారీ అంచనాల మధ్య దిగుతూ ఓడిపోతూ ఉంటే ఒత్తిడి ఎక్కువే ఉంటుంది' అని గౌతీ పేర్కొన్నాడు. ప్రస్తుతం బుమ్రా, డివిలియర్స్ యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.