భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఐటీసీ షేర్ల హవా కొనసాగుతోంది. ఏడాది కాలంగా ఆ షేరు స్థాయికి తగినట్టుగా పెరగలేదు. గురువారం మాత్రం ఏకంగా ఎనిమిది శాతం ఎగిసింది. ఏడు నెలల గరిష్ఠ ధర రూ.233.30ను తాకింది.
దేశ వ్యాప్తంగా కొవిడ్ టీకాలు వేస్తుండటం, మార్కెట్లు స్థిరంగా కొనసాగుతుండటం, సిగరెట్ల వ్యాపారానికి గిరాకీ పెరగడం, నిత్యావసరం సరుకుల ఉత్పత్తి సరఫరా పెరగడంతో ఈ షేరు రాణిస్తోందని నిపుణులు అంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఐటీసీ షేరు అత్యున్నత స్థాయిలో కొనసాగడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 9న రూ.239.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత నేడు బీఎస్‌ఈ ఇంట్రాడేలో రూ.233.30ను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో సంయుక్తంగా 72.1 మిలియన్ల ఈక్విటీ షేర్లు నేడు చేతులు మారాయి.
'పెర్ఫామెన్స్ పరంగా చెప్పాలంటే ఈ షేరు స్థాయికి తగినంతగా రాణించలేదు. అందుకే ఇతర షేర్లతో పోలిస్తే తక్కువకే దొరుకుతోంది. నేడు నిఫ్టీ పుంజుకోవడానికి ఐటీసీయే కారణం. నిఫ్టీ పెరుగుదలలో 30 పాయింట్ల వరకు సాయం చేసింది' అని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ప్రభాకర్ అంటున్నారు.
ఏడాది కాలంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 శాతం రాణించగా ఐటీసీ మాత్రం 28 శాతమే పెరగడం గమనార్హం. మూడేళ్లుగా ఈ షేరు 25 శాతం నష్టపోయింది. ఐటీసీ అనూహ్యంగా పుంజుకోవడంతో మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ట్విటర్లో మీమ్స్‌తో అలరిస్తున్నారు. జులై 24న ఐటీసీ తమ వ్యాపార ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.