మూత్రవిసర్జన చాలా సాధారణ విషయం. అందుకే ఎక్కువ మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. రంగు మారినా పెద్దగా పట్టించుకోరు. కానీ మన ఆరోగ్యాన్ని సూచించే అద్భుతమైన సూచిక యూరిన్ రంగే. అంతెందుకు అనారోగ్య సమస్యలతో వైద్యుడి వద్దకు వెళితే ఆయన రాసే టెస్టుల్లో యూరిన్ పరీక్ష కూడా కచ్చితంగా ఉంటుంది. చివరికి మూత్రపిండాలు తమ విధులను సక్రమంగా చేస్తున్నాయో లేదో ఒక్కోసారి యూరిన్ రంగు నిర్ణయిస్తుంది. అందుకే యూరిన్ రంగు మారితే తేలికగా తీసుకోవద్దు.
1. ఎరుపు
యూరిన్ రంగు కాస్త ఎరుపురంగులోకి మారితే తేలికగా తీసుకోకండి. బ్రిటన్ వైద్యుడు డెబోరా లీ ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం... మూత్రంలో రక్తం కనిపించడం, లేదా ఎరుపు రంగులో యూరిన్ కావడం అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. లేదా కిడ్నీలో రాళ్లు, ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు. మగవారిలో అయితే ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్నా కూడా ఇలా మూత్రంలో రక్తం కనిపించవచ్చు. కాబట్టి యూరిన్ లో ఎరుపురంగు కనిపిస్తే నిర్లక్ష్యం వహించవద్దు.
2. ఆరెంజ్ లేదా గ్రీన్
చాలా మంది నమ్మకపోవచ్చు కానీ... కొన్ని సందర్భాల్లో మూత్రం నీలం లేదా, ఆకుపచ్చ రంగుల్లో ఉండొచ్చు. క్లీవ్ ల్యాండ్కు చెందిన క్లినిక్ ఇచ్చిన సమాచారం ప్రకారం... కీమోథెరపీ కోసం ఇచ్చే మందులు మింగినప్పుడు మూత్రం నారింజ రంగులోకి మారుతుంది. క్యారెట్లు అధికంగా తిన్నప్పుడు, లేదా విటమిన్ సి మాత్రలు తీసుకున్నప్పుడు కూడా నారింజ రంగులో యూరిన్ పడుతుంది. బి విటమిన్ ట్యాబ్లెట్లు యూరిన్ రంగును ఆకుపచ్చ రంగులోకి మారుస్తాయి. ట్యాబ్లెట్లు ఆపేశాక కూడా యూరిన్ రంగు సాధారణంగా మారకపోతే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
3. డార్క్ బ్రౌన్ రంగు
పచ్చకామెర్లతో బాధపడేవారికి మూత్రం డార్క్ బ్రౌన్ రంగులో వచ్చే అవకాశం ఎక్కువ. కాలేయం, పిత్తాశయం, పాంక్రియాస్ లలో ఇబ్బందులన్నవారికి యూరిన్ ఈ రంగులోకి మారుతుంది. ఎవరికైనా కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్లు పచ్చగా మారుతాయి, చర్మం కూడా రంగు మారుతుంది. అలాగే యూరిన్, మలం కూడా ముదురు గోధుమ రంగులోకి మారతాయి. కనుక ఎప్పుడైనా యూరిన్ డార్క్ బ్రౌన్ రంగులోకి మారితే తేలికగా తీసుకోవద్దు.
4. క్లౌడీ
అంటే యూరిన్ పారదర్శంగా ఉండకుండా, కాస్త అస్పష్టంగా, చిన్నచిన్న మలినాలతో కలిపి ఉంటుంది. దాన్ని క్లౌడీ యూరిన్ అంటాం. ఇలా ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు.
5. దుర్వాసన
యూరిన్ వాసన రావడం సహజం. ఒక్కోసారి రోజుకన్నా అతిగా ఘాటుగా వాసన వస్తుంది. ఆహారంలో ఘాటైనా పదార్థాలు అంటే మసాలాలు, వెల్లుల్లి, అల్లం అధికంగా తిన్నప్పుడు యూరిన్ ఘాటు వాసన రావచ్చు. అలాంటివి ఏమీ తినకపోయినా వాసన వస్తే మాత్రం అనుమానించాలి. వ్యక్తి తగినన్ని నీళ్లు తాగక డీహైడ్రేషన్ కు గురైతే ఇలా యూరిన్ అధికంగా వాసన వస్తుంది. లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు
Also read: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో...