తమ చిట్టి చేతులను పట్టి నలుపుతుంటే... ఎందుకో తెలియక బిత్తర చూపులు చూస్తారే తప్ప ఆ చేతులను విడిపించుకోని పారిపోవాలన్న తెలివి వారికి లేదు.
చెంపలను తడుముతుంటే... ముద్దు చేస్తున్నారనుకుంటారు కానీ, ఎదుటి వారి మనుసులోని రాక్షస కోరికను అర్థం చేసుకోలేరు.
ఓ చాక్లెట్లో, బిస్కెట్లో చేతుల్లో పెట్టి, దగ్గరకు తీసుకుంటే ప్రేమనుకుంటారు కానీ తమని కాటేసే కర్కశత్వం అని గ్రహించలేరు.


ఆరేడేళ్ల పిల్లలు అంతకన్నా ఏం ఆలోచించగలరు.  ఎదుటి వారిని చూసి, వారి ప్రవర్తనను గమనించి జాగ్రత్త పడేంత తెలివి వారికి ఉండదు. ఉంటే ఇలా మనం ఒక చైత్రని కోల్పోయి ఉండేవాళ్లం కాదు. ఆ వయసుకు తగ్గ పరిణతే వారికి ఉంటుంది. స్వీయ రక్షణకు సంబంధించిన ఆలోచనలను, తెలివిని ఉత్పత్తి చేసే శక్తి వారి చిట్టి మెదడుకు ఉండదు. కానీ తల్లిదండ్రులుగా మనమే వారికి ఈ విషయంలో కొంత నాలెడ్జ్ ను అందించాలి. స్పర్శల్లో తేడాలను చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే రెండు ఉంటాయని, వాటిల్లో బ్యాడ్ టచ్ లక్షణాలు ఇవని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక్కరోజులో వాళ్లు అర్థం చేసుకోకపోవచ్చు కానీ రోజూ వివరిస్తుంటే వారికి కచ్చితంగా అర్థమవుతుంది. ఆడపిల్లలపైనే కాదు, మగపిల్లలపైనా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఇద్దరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియాల్సిందే. అయితే ఎలా చెప్పాలి... ఇవిగో కొన్ని చిట్కాలు. 


1. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ఓసారి అనుకుని జాగ్రత్తగా సిద్దం అవ్వండి. మీ పిల్లలు ఆడుకునే పాప బొమ్మల్ని ఇందుకు ఉపయోగించుకోండి. ఆ పాప బొమ్మలో ఏ ప్రదేశాలను తాకొచ్చు, ఏ ప్రదేశాలను తాకకూడదో చెప్పండి. తాకకూడని ప్రదేశాలను ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మంచి వాడు కాదని, తనకు హాని చేసే అవకాశం ఉందని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అలాంటప్పుడు అక్కడ ఒక సెకను కూడా ఉండకుండా పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయమని చెప్పండి. 
2. షాపుకు తీసుకెళ్తా, మా ఇంట్లో ఆడుకో రా, మా ఫ్రిజ్ లో చాక్లెట్లు ఉన్నాయి ఇస్తా రా... ఇలాంటి మాటలను నమ్మవద్దని చెప్పండి. ఇలా ఆహారాన్ని ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించడం, వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లడం తీసుకెళుతున్నారు. పిల్లలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. 
3. మీరూ చెప్పాలనుకున్న విషయాలను చిన్న కథల రూపంలోకి మార్చి చెబితే పిల్లలకు త్వరగా అర్థమవుతుంది. చిన్నచిన్న పదాల్లో, వాళ్ల చిట్టి మెదడు విషయాన్ని గ్రహించే విధంగా చెప్పాలి. 
4. గుడ్ టచ్,బ్యాడ్ టచ్ విషయంలో చాలా యానిమేషన్ కథలు పిల్లల కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిని ప్లే చేసి చూడమని చెప్పండి. అది చూశాక పిల్లలకు ఏం అర్థమైందో అడిగి తెలుసుకోండి. అర్థం కాని చోట మీరు వివరించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో బ్యాడ్ టచ్ అనేది ఒకటుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. 
5. చిన్నతనం నుంచే పిల్లలకు కళ్లు, చెవులు, ముక్కలు గురించో ఎలా చెబుతామో... అలాగే వ్యక్తిగత శరీర భాగాల గురించి అవగాహన వచ్చేలా చూడాలి. 
6. ఎవరైనా తమ ఛాతీభాగాలు, వ్యక్తిగత శరీర భాగాలు తడుముతుంటే వెంటనే  అక్కడ్నించి పరిగెట్టుకుని వచ్చి, గట్టిగా అరవమని చెప్పాలి. అంతేకాదు అలా ఎవరైనా తాకితే భయపడకుండా మీకు చెప్పమనాలి. తెలియని వారి ఇళ్లలోకి వెళ్లొద్దని వివరించండి. 


అన్నింటి కన్నా ముఖ్యంగా మీ పిల్లలు ఏ విషయాన్నైనా మీతో స్నేహంగా చెప్పుకునే వాతావరణాన్ని ఇంట్లో ఉండేలా చూడండి. 


Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు


Also read: పిల్లలకి ఇవి తినిపించండి... రక్త హీనత దరిచేరదు