రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు తనను బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కోటాలోనే ఎంపిక చేసుకున్నారని యువ ఆటగాడు దీపక్ చాహర్ అన్నాడు. ఆడిన తొలి ట్రయల్ మ్యాచులో 48+ పరుగులు చేయడంతో తనను వన్‌డౌన్‌కు పంపించారని పేర్కొన్నాడు. ఆ తర్వాత అర్ధశతకం చేశానని గుర్తు చేసుకొన్నాడు. ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో అతడు మాట్లాడాడు.
'ఐపీఎల్‌లో మొదట నేను పుణెకు ఆడాను. నిజానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ సర్ నన్ను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానే ఎంపిక చేశారు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కాదు. మొదటి ట్రయల్ మ్యాచులో నేను 48 లేదా 49 పరుగులు చేశాను. ఆ తర్వాతి మ్యాచులో వన్‌డౌన్‌కు ప్రమోట్ చేయడంతో అర్ధశతకం బాదేశాను' అని చోప్రాతో దీపక్ అన్నాడు.
'పుణె తర్వాత నేను చెన్నైకి వచ్చాను. అన్ని విభాగాల్లోని ఆటగాళ్ల ఎదుగుదలకు ఎంఎస్ ధోనీ సాయం చేస్తుంటాడు. 2018లో ఓ మ్యాచులో నన్ను అతడి కన్నా ముందుగా పంపించాడు. 19-20 బంతుల్లోనే నేను 40+ పరుగులు చేశాను. ఐతే ఆ తర్వాత బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. బౌలింగ్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉండటంతో 2014 నుంచే నేను బ్యాటింగ్‌పై దృష్టి సారించాను. బ్యాటుతో కొన్ని పరుగులు చేస్తే ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది' అని దీపక్ తెలిపాడు.
Also read: IPL 2021, Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగులో దీపక్ చాహర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఆ జట్టు విజయాల్లో కీలకంగా ఉంటున్నాడు. అతడి బౌలింగ్‌ను ఎంఎస్ ధోనీ చక్కగా ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి, చల్లని వాతావరణం ఉంటే దీపక్ రెచ్చిపోతాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు తీస్తుంటాడు. చాలా సందర్భాల్లో ధోనీ అతడిని పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు వేయించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లోని సీఎస్‌కే శిబిరంలో చాహర్ కసరత్తులు చేస్తూ రెండో దశకు సిద్ధమవుతున్నాడు.