ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అభిమానులకు శుభవార్త! ఇక ఐపీఎల్‌ను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.  పరిమిత సంఖ్యలో అభిమానులను మైదానంలోకి అనుమతించబోతున్నారని సమాచారం. ఈ మేరకు ఐపీఎల్‌ పాలక మండలి, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది.


కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల మైదానాల్లోకి అభిమానులను అనుమతించడం లేదు. చివరిసారిగా 2019లో భారత్‌లో అభిమానులు పొట్టి క్రికెట్‌ లీగ్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించారు. 2020లో కరోనా వేగంగా వ్యాపించడంతో అసలు లీగునే మూడు నెలల వరకు నిరవధికంగా వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో యూఏఈకి వేదికను తరలించి లీగ్‌ను నిర్వహించినా.. అభిమానులకు అనుమతి ఇవ్వలేదు.


Also Read: IPL 2021, Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్‌ గెలవాలంటే ఏం చేయాలి?


ఈ ఏడాది సరైన సమయంలోనే భారత్‌లో ఐపీఎల్‌ను నిర్వహించారు. ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని  కఠినంగానే బయో బుడగలను ఏర్పాటు చేశారు. నెల రోజులపాటు లీగ్‌ అభిమానులను అలరించింది. ఎప్పుడైతే వేదికలు ముంబయి, చెన్నై నుంచి దిల్లీ, అహ్మదాబాదుకు తరలించారో బుడగల్లోకి వైరస్‌ ప్రవేశించింది. దాంతో లీగ్‌ మధ్యలోనే నిరవధికంగా వాయిదా పడింది. మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అభిమానులను అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది.


Also Read: Sourav Ganguly vs MS Dhoni: దాదా, మహీలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే..! సెహ్వాగ్‌ ఇచ్చిన జవాబేంటో తెలుసా?


అభిమానులను అనుమతించే విషయంపై నిర్వాహకులు బుధవారమే పరోక్షంగా సూచనలు ఇచ్చారు. సందర్భాన్ని బట్టి పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తామని ప్రకటించారు. యూఏఈ కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సంఖ్య ఉంటుందని తెలిపారు. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేస్తున్నారని తెలిసింది. అక్టోబర్‌ 17  నుంచి మెగాటోర్నీ ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే. అప్పటికి పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులను అనుమతించాలన్నది బీసీసీఐ లక్ష్యం పెట్టుకొంది.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా సాగుతోంది. యూఏఈలోనూ దాదాపుగా అందరికీ టీకా వేశారు. అంటే వారికి ప్రవేశం దొరికినట్టే. విదేశీ ప్రేక్షకుల విషయంలో ఏం చేస్తారన్నది మాత్రం తెలియలేదు. అయితే పూర్తిగా టీకా వేయించుకొంటే విదేశీయులకు అనుమతి ఇవ్వొచ్చని సమాచారం.


 


Also Read: ఒక్కరోజు ఆలస్యంతో ఎంత వడ్డీ నష్టపోతారో తెలుసా? పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై, ఈపీఎఫ్‌ జమ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి!