భవిష్యత్తంటే అందరికీ ఆశే..! అందుకే సంపాదించే ఆదాయంలో కొద్దిమొత్తం పెట్టుబడులు పెడుతుంటారు. నష్టభయం తక్కువగా ఉండాలని సురక్షితమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటారు. ప్రభుత్వ హామీ ఉండే సుకన్య సమృద్ధి యోజన, ప్రజా భవిష్యనిధి, ఉద్యోగ భవిష్యనిధి వంటి పథకాల్లో జమ చేస్తుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తుంటారు. అందుకు మంచి వడ్డీని ఆశిస్తారు. కానీ ఒక చిన్న పొరపాటుతో వడ్డీలో కొంత భాగం నష్టపోతుంటారని మీకు తెలుసా?


అదే.. సరైన తేదీలోగా డబ్బులు జమ చేయకపోవడం. 


ఏంటీ..! ఒకట్రెండు రోజులు ఆలస్యంగా జమ చేస్తే భారీ స్థాయిలో వడ్డీ నష్టపోతామా అనుకుంటున్నారా? అవునండీ.. నెలలో ఫలానా  తేదీలోపు డబ్బులు జమ చేయకపోతే నెలల కొద్దీ వడ్డీ నష్టపోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరింత వడ్డీని పొందొచ్చని చెబుతున్నారు.


స్థిర ఆదాయ సాధనలు


మంచి వడ్డీ పొందేందుకు ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) మంచి ఆర్థిక సాధనాలు. పోస్టాఫీస్‌లో వీటిని సుదీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఏటా కొంత డబ్బు కచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్‌లో ఏడాదికి కనీసం రూ.500, ఎస్‌ఎస్‌వైలో రూ.250 జమ చేయాలి.


ఒక్క రోజు తేడాతో..


ఈ రెండు ఖాతాల్లో వడ్డీని ఆర్థిక సంవత్సరం చివరన జమ చేస్తారు. చక్రవడ్డీనీ వార్షిక ప్రాతిపదికనే ఇస్తారు. అయితే ప్రతినెలా వడ్డీని ఐదో తారీకుకు ముందుగానే, తక్కువ మొత్తంపై లెక్కిస్తారు.  ఉదాహరణకు పీపీఎఫ్‌/ఎస్‌ఎస్‌వై ఖాతాల్లో 2021 జులై చివరికి రూ.3 లక్షల బ్యాలెన్స్‌ ఉందనుకుందాం. ఆగస్టులో మీరు పదివేల రూపాయాలు జమ చేద్దామనుకున్నారు.


దానిని 6వ తేదీ తర్వాత జమ చేస్తే వడ్డీని రూ.౩ లక్షల పైనే లెక్కిస్తారు. రూ.3.10 లక్షలను పరిగణనలోకి తీసుకోరు. సెప్టెంబర్‌ నెల చివరి నుంచి ఆ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారు. అంటే ఒక నెల రోజులు కొంత వడ్డీ నష్టపోతున్నట్టే కదా. పైగా చక్రవడ్డీ పరంగా చూసుకుంటే మరింత నష్టపోతున్నట్టే!


సేవింగ్స్‌ ఖాతాలోనూ..


ఇక పోస్టాఫీసు సేవింగ్స్‌ అకౌంట్‌ (పీఓఎస్‌ఏ)కూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. వీటికీ ఏడాది ఆఖర్లోనే వడ్డీ జమ చేస్తారు. ప్రతి నెలా పదో తారీకు లోపు ఉన్న తక్కువ మొత్తంపైనే వడ్డీ లెక్కిస్తారు. అంటే ముందు నెల.. చివర్లో ఉన్న మొత్తం పైనే లెక్కిస్తారు కాబట్టి తర్వాతి నెల ఆరంభంలో డబ్బులు విత్‌డ్రా చేసుకున్నా ఇబ్బందేమీ లేదు. ఆఖర్లో ఎక్కువ జమ చేసుకుంటే మరింత వడ్డీ పొందొచ్చు!


పీఎఫ్‌లో ఇలా నష్టం


ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఉద్యోగి, యజమాని కలిసి మూల వేతనంలో 24శాతం ఖాతాలో జమ చేస్తారు. వీటిల్లో నెల మొదటి రోజునే వడ్డీని లెక్కిస్తారు. ఉదాహరణకు 2021 ఏప్రిల్‌ కంట్రిబ్యూషన్‌ను ఏప్రిల్‌ చివరన జమ చేశారనుకుందాం. అప్పుడు 2022 ఆర్థిక ఏడాది (2021 మే నుంచి 2022 మార్చి)లో ఆ మొత్తంపై 11 నెలలకు వడ్డీ వస్తుంది. కానీ అదే ఏప్రిల్‌ పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ను మీ యజమాని 2021 మే ఆరంభంలో జమచేస్తే వడ్డీని 10 నెలలకు మాత్రమే లెక్కిస్తారు. అంటే 2021 జూన్‌ నుంచి 2022 మార్చి వరకే లెక్కిస్తారు. అయితే పీఎఫ్‌ చెల్లింపులు యజమాని నియంత్రణలో ఉంటాయని తెలిసిందే.


మెచ్యూరిటీ తర్వాతా వడ్డీ


స్థిర ఆదాయ సాధనాలైన పీపీఎఫ్‌/ఎస్‌ఎస్‌వై, ఈపీఎఫ్‌ మెచ్యూరిటీ తర్వాతా కొంతకాలం వడ్డీ పొందొచ్చు. ఉదాహరణకు ఉద్యోగి 55ఏళ్ల తర్వాత రిటైర్‌ అయినా పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ ఆగిపోయిన మూడేళ్ల వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. రిటైర్మెంట్‌ వయసైన 55కు ముందే ఖాతా అచేతనంగా మారినా ఉద్యోగికి 58ఏళ్లు వచ్చే వరకు వడ్డీ వస్తుంది. ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌ జమ చేయాల్సిన కనీస కాల పరిమితి 15 ఏళ్లు. ఒకవేళ అవసరమనుకుంటే ఖాతా తెరిచినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు జమ చేసుకోవచ్చు. పరిమితులకు లోబడి వడ్డీ లభిస్తుంది.