ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. రెండు దేశాల్లో ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పుడు అంత లేదు కానీ.. గతంలో అయితే ఓడిపోయిన జట్టులోని ఆటగాళ్ల ఇళ్ల మీద దాడులు కూడా జరిగేవి. ఇక ఈ రెండు జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అంటే రెండు దేశాలూ పూర్తిగా స్తంభించిపోతాయి. ఎందుకంటే ప్రపంచ కప్‌లో పాక్‌పై ఓటమి లేని రికార్డును కొనసాగించాలని భారత్, ఒక్కసారయినా నెగ్గి ఆ రికార్డును బ్రేక్ చేయాలని పాక్ తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాయి.


టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్తాన్ ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టై కాగా.. భారత్ బౌల్ అవుట్‌లో విజయం సాధించింది. అదే కప్ ఫైనల్‌లో కూడా భారత్, పాకిస్తానే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో ఉండగా.. మిస్బా స్కూప్ షాట్ ఆడటం, ఆ బంతి నేరుగా శ్రీశాంత్ చేతుల్లో పడటం, ఆ తర్వాత కప్ మన చేతికి రావడం ఎవరూ మర్చిపోలేరు.


ఇక ప్రస్తుత బలాబలాలు చూస్తే.. రెండు జట్లూ రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా.. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. అయితే వార్మప్ మ్యాచ్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే జట్లు గెలుపు కంటే.. తమ జట్టులోని ఆటగాళ్లకు ప్రాక్టీస్ అందించడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతాయి.


ఈ మ్యాచ్‌లో ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. తనకు తోడుగా ఓపెనింగ్ చేయనున్న రోహిత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక వన్‌డౌన్‌లో రానున్న కెప్టెన్ కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తన ప్రస్తుతం ఫాం కాస్త ఇబ్బందికరంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా.. ఇలా బ్యాటింగ్ లైనప్ అంతా విధ్వంసకర బ్యాట్స్‌మెనే. ఇక బౌలింగ్ కూడా బ్యాటింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్.. ఇలా అందరూ ఐపీఎల్‌లో పరుగులు కట్టడి చేయడంతో పాటు.. వికెట్లు కూడా తీసినవారే. అయితే ఆరోజు ఎలా ఆడారు అన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. వీరందరూ తమ 100 శాతం ప్రదర్శనను ఇవ్వాల్సిందే.


ఇక పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ప్రధానంగా బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ల మీదనే ఆధారపడింది. మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీంలు కూడా ఇటీవలి కాలంలో బాగానే రాణిస్తున్నారు. బౌలర్లలో షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీలు జట్టుకు కీలకంగా మారనున్నారు. పాకిస్తాన్ భారత్‌తో తలపడే మ్యాచ్‌లో ఉండబోయే 12 మంది ఆటగాళ్ల జాబితాను కూడా వెల్లడించింది. వీరిలో ఒకరు రేపు బెంచ్‌కి పరిమితం కానున్నారు.


పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీం, మహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది


భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా... ఈ రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ జట్లు మ్యాచ్‌లు తలపడుతున్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే పోటీ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. ఏబీపీ దేశం తరఫున ఆల్ ది బెస్ట్ టు టీమిండియా!


Also Read: ఆ జట్లే ఫేవరెట్‌.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్‌ జోస్యం


Also Read: విరాట్‌ కోహ్లీ కన్నా బాబర్‌ ఆజామ్ అంత గొప్పా? పాక్‌-భారత్‌ పోరులో విజేత ఎవరు?


Also Read: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి