ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 మ్యాచ్‌లో వెస్టిండీస్ కుప్పకూలింది. 14.2 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కేవలం రెండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం.


టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే వెస్టిండీస్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన ఎవిన్ లూయిస్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో లెండిల్ సిమ్మన్స్, ఐదో ఓవర్లో షిమ్రన్ హెట్‌మేయర్, ఆరో ఓవర్లో క్రిస్ గేల్ కూడా అవుట్ కావడంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది.


ఆ తర్వాత కూడా వికెట్ల పతనం అస్సలు ఆగలేదు. ఎనిమిదో ఓవర్లో డ్వేన్ బ్రేవోను క్రిస్ జోర్డాన్ అవుట్ చేయగా.. తొమ్మిదో ఓవర్లో నికోలస్ పూరన్‌ను టైమల్ మిల్స్ పెవిలియన్ దారి పట్టించాడు. 10 ఓవర్లలో వెస్టిండీస్ ఆరు వికెట్లు నష్టపోయి 44 పరుగులు మాత్రమే చేసింది.


10 ఓవర్లలో తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసిపోవడానికి ఎంతో సేపు పట్టలేదు. చివరి నాలుగు వికెట్లను క్రిస్ జోర్డానే తీశాడు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ రసెల్‌ను అవుట్ చేసిన జోర్డాన్, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో కీరన్ పొలార్డ్, ఓబెడ్ మెక్‌కాయ్‌ని, మూడో ఓవర్లో రవి రాంపాల్‌ని అవుట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 14.2 ఓవర్లలో 55 పరుగులకే వెస్టిండీస్ చాప చుట్టేసింది.


క్రిస్ గేల్ తప్ప వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. క్రిస్ గేల్, పొలార్డ్, నాటౌట్‌గా నిలిచిన అకియల్ హుస్సేన్ తప్ప 10 బంతులు కూడా ఎవరూ ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ మొత్తమ్మీద ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే వచ్చాయి. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మొయిన్ అలీ, టైమల్ మిల్స్ రెండేసి వికెట్లు తీశారు. క్రిస్ గేల్, జోర్డాన్‌లకు చెరో వికెట్ దక్కింది. బౌలింగ్ వేసిన ఇంగ్లండ్ బౌలర్లందరూ వికెట్లు తీయగలిగారు.


Also Read: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?


Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి