విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. విరాట్ టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఈ వరల్డ్ కప్ తర్వాత దిగిపోతానని చెప్పినప్పుడు కారణం ఏంటో అని చాలా మంది క్యూరియాసిటీ చూపించారు. ఇప్పుడు విరాట్ మీడియా ముందుకు రావడంతో ఈ ప్రశ్న కూడా తనకు ఎదురైంది. అయితే విరాట్ మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించాడు. వివాదాలు కోరుకునేవారికి తాను మసాలాను అందించబోనని తెలిపాడు. దీంతో పాటు మంటలో పెట్రోల్ పోసే ఉద్దేశం కూడా తనకు లేదన్నాడు.


‘ఈ విషయంపై నేను చెప్పాలనుకున్నది అంతా ఇప్పటికే చెప్పేశాను. ఇక ఈ విషయంలో స్పందించడానికేమీ లేదు.’ అని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం తమ ఫోకస్ గేమ్ ప్లే మీదనే ఉందన్నాడు. జట్టుగా తాము ఎలా ఆడాలన్న దాని గురించి మాత్రమే తాము ఆలోచించాలనుకుంటున్నట్లు తెలిపాడు.


‘ఏమీ లేని విషయాలు తవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి తానెప్పటికీ అవకాశం ఇవ్వను.’ అని తెలిపాడు. ‘నేను చెప్పాలనుకున్నది నిజాయితీగా, ఓపెన్‌గా చెప్పాను. ఇప్పటికీ అందులో చెప్పాల్సిందేమైనా ఉందని ఎవరైనా అనుకుంటే వారి మీద నేను జాలి పడుతున్నాను. అక్కడ చెప్పాల్సిందేమీ లేదు.’ అని కోహ్లీ వివరించాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు సంబంధించిన తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ ముందువరకు తాము జట్టును ప్రకటించబోమన్నాడు.


విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్‌గా దిగిపోమని తాము ఒత్తిడి చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలోనే మీడియాకు వెల్లడించాడు. ‘విరాట్ కోహ్లీ నిర్ణయంతో నేను కూడా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇంగ్లండ్ టూర్ తర్వాతనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. అది పూర్తిగా కోహ్లీ నిర్ణయం. మా వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు.’ అని గంగూలీ తెలిపారు.


‘అటువంటి విషయాలు మేం అసలు చేయం. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. ఇన్ని ఫార్మాట్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టం’ అన్నాడు. ‘నేను ఆరు సంవత్సరాలు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. బయట నుంచి చూడటానికి బానే ఉంటుంది. కానీ లోపల నుంచి మాత్రం అది నిన్ను కాల్చేస్తుంది. టెండూల్కర్ అయినా, గంగూలీ అయినా, ధోని అయినా, కోహ్లీ అయినా.. ఎవరికి అయినా.. కెప్టెన్సీ అనేది చాలా కష్టమైన పని’ అని తెలిపాడు.


Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి