ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి దశ మ్యాచులు అద్భుతంగా జరుగుతున్నాయి. చిన్న జట్లే అయినా అభిమానులను అలరించడంలో వెనకాడటం లేదు.   మరో మూడు రోజుల్లో అసలు సిసలైన సూపర్‌ 12 మ్యాచులు మొదలవ్వనున్నాయి. అయితే ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రికెటర్లలో కొందరు కోటీశ్వరులు ఉన్నారు. అందులో టాప్‌-5 ఎవరో చూద్దామా?


విరాట్‌ కోహ్లీ (Virat Kohli): ఈ ప్రపంచకప్‌ ఆడుతున్న కోటీశ్వరుల్లో  అందరి కన్నా ముందున్నాడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో అతిపెద్ద కోటీశ్వరుడు కోహ్లీయే. అతడి ప్రస్తుత నెట్‌వర్త్‌ రూ.450 కోట్లకు పైగానే ఉంటుంది. బీసీసీఐ ద్వారా ఏటా అతడు రూ.7 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి ఏటా రూ.17 కోట్లు పొందుతున్నాడు. సాధారణంగా ఇన్‌స్టాలో ఒక పోస్టు పెట్టేందుకు అతడు రూ.5 కోట్లు తీసుకుంటాడు. ఇక వ్యాపార ప్రకటనలు, ఒప్పందాలతో వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు.


ప్యాట్‌ కమిన్స్‌ ( Pat Cummins): ప్రపంచంలోనే అతిపెద్ద రెండో కోటీశ్వరుడిగా ప్యాట్‌ కమిన్స్‌ నిలవడం ఆశ్చర్యకరమే! ఎందుకంటే ఒక బౌలర్‌ ఆ స్థాయిని అందుకోవడం కష్టం. దాదాపుగా అతడి నెట్‌వర్త్‌ రూ.308 కోట్లుగా ఉంది. ఐపీఎల్‌లో కేకేఆర్‌ అతడిని రూ.15.5 కోట్లకు కొనుక్కుంది. ఆసీస్‌కు మూడు ఫార్మాట్లు ఆడుతున్న కమిన్స్‌కు ఇతర లీగులు, ఒప్పందాల ద్వారా ఆదాయం వస్తోంది.


క్రిస్‌గేల్‌ (Chris Gayle): ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర క్రికెటర్‌ క్రిస్‌గేల్‌. తన బ్యాటింగ్‌తో యూనివర్స్‌ బాస్‌గా మారిపోయాడు. కెరీర్‌ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయాలను ఆర్జించాడు. ప్రస్తుతం అతడి నెట్‌వర్త్‌ రూ.262 కోట్లు. ఏడాదికి అతడు రూ.36 కోట్ల వరకు ఆర్జిస్తాడట. పంజాబ్‌ కింగ్స్‌ నుంచి ఏటా రూ.2 కోట్లు అందుకుంటున్నాడు. ఇంకా ప్రకటనల ద్వారా ఆదాయం సముపార్జిస్తున్నాడు.


షకిబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al-Hassan): బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. అతడి నెట్‌వర్త్‌ను రూ.262 కోట్లుగా అంచనా వేస్తున్నారు. క్రిస్‌గేల్‌తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతాకు ఆడతాడు. ఏటా రూ.3.2 కోట్లు పొందుతున్నాడు. అంతకు ముందు అతడికి భారీ స్థాయిలో డబ్బు వచ్చేది. ఇక జాతీయ జట్టుకు, ఇతర క్రికెట్‌ లీగుల్లో ఆడటం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. ఒప్పందాలు, ప్రకటనల ద్వారానూ బాగానే వస్తుంది.


స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith): ఈ ఆస్ట్రేలియా మాజీ సారథి ఒకప్పుడు విరాట్‌ కోహ్లీతో పోటీపడేవాడు. ఏడాది నిషేధంతో అతడి నెట్‌వర్త్‌ తగ్గిపోయింది. ప్రస్తుతం అతడి నెట్‌వర్త్‌ రూ.187 కోట్లుగా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడినప్పుడు ఎక్కువ మొత్తం పొందేవాడు. దిల్లీకి వెళ్లాక ఐపీఎల్‌లో రూ.2.2 కోట్లు మాత్రమే సంపాదిస్తున్నాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అతడికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉంది. ఇక ప్రకటనలు, ఒప్పందాల ద్వారా ఎక్కువగానే ఆర్జిస్తున్నాడు.


Also Read: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఏస్ పేసర్.. ఐపీఎల్‌లో ఏ టీంకు ఆడాడంటే?


Also Read: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


Also Read: షాక్‌..! బీసీసీఐ ఆఫర్‌ తిరస్కరించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఎందుకంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి