విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. మన రాష్ట్రానికి చెందిన 11 మంది ఉన్నారని తెలిపారు. అమరవీరులందరికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం వైసీపీదేనని సీఎం జగన్ చెప్పారు. కొవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయామని... ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కాబట్టి నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.
పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చెప్పారు. కొవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశామని.. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించామని సీఎం జగన్ అన్నారు. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచినట్టు గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 1500 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు.
అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు
అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని జగన్ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని విమర్శించారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారని ఆరోపించా. సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారని.. సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదన్నారు.
అనంతపురంలో..
పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా అనంతపురంలో పోలీసులు నివాళులర్పించారు. పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్థూపానికి డీఐజీ కాంతిరాణా టాటా, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్ఫీ ఫక్కీరప్ప నివాళులర్పించారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు మరువలేనివని డీఐజీ తెలిపారు. అమరులైన వారి కుటుంబ సభ్యులకు చట్టప్రకారం సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరులైన పోలీసులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పోలీసులు తమ విధులలో దేశ, రాష్ట్ర రక్షణ కోసం కృషి చేయాలని చెప్పారు. పోలీసు సేవల ద్వారా మహిళల రక్షణ కల్పించడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల రక్షణకు అనేక రకాలుగా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి