తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడుల ఘటనలపై రాజకీయ విమర్శలు వాడివేడిగా చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతా చంద్రబాబే చేశారని ఆయన సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితులు మారాలంటే చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలని కొంత మంది సలహా ఇచ్చారు.

 
 
టీడీపీని రద్దు చేయాలని ఈసీని కోరుతామన్న మంత్రి బొత్స !
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  టీడీపీ నేతల భాషను పవన్‌, బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.






చంద్రబాబు, పవన్‌ కలిసి ప్లాన్‌ ప్రకారమే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి .. మావోయిస్టులకు తేడా లేదని.. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు.

 


Also Read : చేతకాని దద్దమ్మలే తిడతారు.. తిడితే ఇక ముందు అదే రియాక్షన్ వస్తుందని సజ్జల హెచ్చరిక !


చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్న కన్నబాబు !
చంద్రబాబు కుట్రలో ఏపీ ప్రజలు పడరని మరో మంత్రి కన్నబాబు వ్యాఖ్యానిచారు. సిఎం జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు మాట్లాడే భాష చాలా అభ్యంత‌రక‌రంమన్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్రత‌లు లేవ‌నే ప్రచారం చేసుకోవ‌డానికి టీడీపీ ఇలా చేస్తోందన్నారు. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సీఎం జగన్‌ను దూషిస్తున్నారని  నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.


Also Read : " ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు " - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !


చంద్రబాబువన్నీ నీచ రాజకీయాలేనన్న కొడాలి నాని!
చంద్రబాబులా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఏపీలో ఎదో జరిగిపోతోంది. శాంతిభద్రతలు లేవు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్‌ సప్లై చేస్తున్నాడనే ప్రచారం కోసం టీడీపీ ప్రయత్నం చేసిందన్నారు. ఎన్ని చేసినా  ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేవని హెచ్చరించారు. 


Also Read : నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?






వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులు సరైనవేనన్న ఎంపీ మోపిదేవి !
ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి కోల్పోతుందని భయం పట్టుకుందని మోపిదేవి విమర్శించారు. భయంతోనే పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి లాంటి వారితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి మాట్లాడే భాష వింటుంటే రక్తం మరిగిపోతుందన్నారు. వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ బాష అలా ఉంటే వైసీపీ ప్రతి చర్య ఇలానే ఉంటుందని .. చంద్రబాబు, అతని అనుచరులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి హెచ్చరించారు. 


Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి